LOADING...
GHMC:జీహెచ్‌ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !
జీహెచ్‌ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !

GHMC:జీహెచ్‌ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
08:56 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)ను విభజించే ప్రక్రియకు ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీన దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని సమాచారం. ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్‌ కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించిన రాష్ట్ర ప్రభుత్వం, అదే క్రమంలో జీహెచ్‌ఎంసీని కూడా మూడు కార్పొరేషన్లుగా విడగొట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగియనున్న నేపథ్యంలో, అదే రోజున విభజన ఉత్తర్వులు జారీ చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

27 మున్సిపాలిటీలు జీహెచ్‌ఎంసీలో విలీనం

ఈ విభజన అనంతరం శేరిలింగంపల్లి, హైదరాబాద్‌, మల్కాజిగిరి పేర్లతో మూడు కొత్త మున్సిపల్‌ కార్పొరేషన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్త కార్పొరేషన్లకు ఫిబ్రవరి 10 నుంచి ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా,ఆగస్టు నెలలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. రాజధాని నగరం హైదరాబాద్‌ను వేగంగా, సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలో ఉన్న 27మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసింది. ఈ పరిణామాలతో ఒక దశలో జీహెచ్‌ఎంసీ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా మారుతుందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే,పరిపాలన మరింత సులభంగా,సమర్థవంతంగా సాగాలనే ఉద్దేశంతో జీహెచ్‌ఎంసీని మూడు భాగాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది.

వివరాలు 

'ఫ్యూచర్‌ సిటీ' కమిషనరేట్‌ పేరుతో మరో కొత్త కమిషనరేట్

పరిపాలన సజావుగా కొనసాగేందుకు పోలీస్‌, మున్సిపల్‌ శాఖల సరిహద్దులు ఒకే విధంగా ఉండేలా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించగా, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిని విస్తరించడంతో పాటు రాచకొండ కమిషనరేట్‌ను మల్కాజిగిరిగా మార్చారు. ఈ మూడు కమిషనరేట్లకు అదనంగా 'ఫ్యూచర్‌ సిటీ' కమిషనరేట్‌ పేరుతో మరో కొత్త కమిషనరేట్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇదే నమూనాలో ఇప్పుడు ప్రతిపాదిస్తున్న మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

Advertisement

వివరాలు 

జీహెచ్‌ఎంసీకి అదనపు కమిషనర్లు

ఫ్యూచర్‌ సిటీ, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రాంతాలతో శేరిలింగంపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని ప్రాంతాలతో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని ప్రాంతాలతో మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగానే ఇటీవల జరిగిన బదిలీల్లో ఐఏఎస్‌ అధికారులు వినయ్‌కృష్ణారెడ్డి, సృజనలను జీహెచ్‌ఎంసీకి అదనపు కమిషనర్లుగా నియమించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న కర్ణన్‌ను కొనసాగిస్తూ, సృజనను శేరిలింగంపల్లి ప్రత్యేక కమిషనర్‌గా, వినయ్‌కృష్ణారెడ్డిని మల్కాజిగిరి ప్రత్యేక కమిషనర్‌గా నియమించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement