Gig workers: నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా గిగ్‌వర్కర్లు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు. ఇంధన ధరల పెంపు, తక్కువ వేతనాలను నిరసిస్తూ వారు ఐదు గంటలపాటు విధులను బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. గిగ్, ప్లాట్‌ఫారమ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (జీఐపీఎస్‌డబ్ల్యూయూ) పిలుపు మేరకు వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లతో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు తాత్కాలికంగా సేవలను నిలిపివేయనున్నారు.
వివరాలు
గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలి
ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచడంతో డెలివరీ వర్కర్లు, క్యాబ్ డ్రైవర్లపై అదనపు ఆర్థికభారం పడుతోందని యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరల పెంపు కారణంగా దేశవ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల మంది గిగ్‌వర్కర్లు నేరుగా ప్రభావితమవుతారని పేర్కొంది. గతంలో కూడా ఆదాయాలు తగ్గిపోవడం, సామాజిక భద్రత లేకపోవడం వంటి సమస్యలపై గిగ్‌వర్కర్లు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గిగ్‌వర్కర్లకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.