Lake Burst: భూటాన్‌లో కట్టలు తెంచుకున్న సరస్సు.. అస్సాం, బెంగాల్ జిల్లాలలో హైఅలర్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భూటాన్‌లోని హిమానీనద సరస్సు కట్ట తెగిపోవడంతో భారీగా వరద నీరు దిగువ ప్రాంతాలకు పోటెత్తింది. దీంతో భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. భూటాన్‌లోని గసా జిల్లాలో లోంగో,లయా గెవోగ్ పరిధిలో వాకిలా పర్వతం దిగువన ఉన్న షింటాఫు సరస్సు వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సరస్సు నుంచి ఒక్కసారిగా భారీగా నీరు విడుదల కావడంతో అది భారత్ వైపు దూసుకొచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్,అస్సాం రాష్ట్రాలకు ప్రత్యేక వరద హెచ్చరికలు జారీ చేసింది. భూటాన్‌లోని పునాత్సంగ్‌చు నదీ పరీవాహక ప్రాంతంలో షింటాఫు సరస్సు ఉంది.ఈ నది భారత్‌లోకి ప్రవేశించిన తర్వాత సంకోశ్ నదిగా పిలుస్తారు.
వివరాలు
6 నుంచి 8 గంటల్లోనే భారత సరిహద్దులోకి..
సరస్సు కట్ట తెగిపోవడంతో సంకోశ్ నదిలో నీటిమట్టం అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
దీంతో అస్సాంలోని ధుబ్రి జిల్లాతో పాటు ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్ హిల్స్,అలీపుర్దుఆర్, జల్పాయ్‌గురి,కూచ్‌బెహార్ జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్ జిల్లా తుఫాన్‌గంజ్, బొక్సీహత్ ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
ఈ ప్రాంతాలు అస్సాం సరిహద్దులోని సంకోశ్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
నదికి సమీపంలో నివసిస్తున్న ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భూటాన్ సరిహద్దు నుంచి వరద నీరు కేవలం 6 నుంచి 8 గంటల్లోనే భారత సరిహద్దులోకి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
జీఎల్‌ఓఎఫ్ (GLOF) అంటే ఏమిటి?
హిమానీనదాలు (గ్లేసియర్స్) కరగడం వల్ల పర్వత ప్రాంతాల్లో సరస్సులు ఏర్పడతాయి.
వీటికి సహజంగా ఉండే మంచు, మట్టి కట్టలు ఒక్కసారిగా తెగిపోవడం లేదా నీటి ఒత్తిడిని తట్టుకోలేక బద్దలవడాన్ని 'గ్లేసియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్' (GLOF) అంటారు.
ఇలాంటి సమయంలో సరస్సులో నిల్వ ఉన్న నీరు ఒక్కసారిగా భారీ ప్రవాహంగా బయటకు వస్తుంది.
కొండలు, లోయల గుండా వేగంగా ప్రవహిస్తూ మార్గమధ్యంలోని రహదారులు, వంతెనలు, నివాస ప్రాంతాలు, వ్యవసాయ భూములను ముంచెత్తే ప్రమాదం ఉంటుంది.
వివరాలు
జీఎల్‌ఓఎఫ్ (GLOF) అంటే ఏమిటి?
భూటాన్‌లో గుర్తించిన 17 ప్రమాదకరమైన హిమానీనద సరస్సుల్లో షింటాఫు సరస్సు కూడా ఒకటి.
ఈ సరస్సు నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు తక్త్సమఖంగ్ వద్ద నీటిమట్టం కొలిచే కేంద్రం ఉంది.
అయితే తొలి సమాచారం అందే సమయానికి అక్కడ ఎలాంటి హెచ్చరిక అలర్ట్ రాలేదని నేషనల్ సెంటర్ ఫర్ హైడ్రాలజీ అండ్ మెటిరాలజీ (NCHM) అధికారి వెల్లడించారు.
వివరాలు
ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి: మంత్రి మనోజ్ కుమార్ ఓరాన్
వరద ముప్పు నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, కుమర్‌గ్రామ్ ఎమ్మెల్యే మనోజ్ కుమార్ ఓరాన్ అలీపుర్దుఆర్ జిల్లా సంకోశ్ నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
కుమర్‌గ్రామ్ నియోజకవర్గ పరిధిలో నదీతీర ప్రాంతాల్లో నివసిస్తున్నవారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆయన వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.
రాబోయే గంటన్నరలోనే గతంలో ఎన్నడూ లేనంత తీవ్రంగా వరద ప్రవాహం ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రాణనష్టం జరగకుండా ప్రజలు అధికార యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలని కోరారు.
వివరాలు
నదిలో నీటి కదలికలు,ప్రవాహ పరిశీలన
సంకోశ్ నదిలో నీటిమట్టం పెరిగి వరద ప్రవాహం ఉద్ధృతమైతే నదీతీర గ్రామాలు నీటమునిగే ప్రమాదం ఉంది.
ప్రజలతో పాటు పశువులు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు, వ్యవసాయ పంటలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నదిలో నీటి కదలికలు, ప్రవాహ వేగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
దిగువ ప్రాంతాల్లోని ప్రజలకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ముందస్తు రక్షణ చర్యలను ముమ్మరం చేశారు.