Shashi Tharoor: ప్రధాని మోదీని మరోసారి ప్రశంసించిన శశిథరూర్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రసంశలు కురిపించారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ఒక వ్యక్తిగత కార్యక్రమానికి తాను హాజరయ్యానని, అందులో మోదీ దేశ అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడారని థరూర్ వెల్లడించారు. మోదీకి అనుకూలంగా మాట్లాడుతున్నందుకు తాను చెందిన పార్టీ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, థరూర్ తాజా వ్యాఖ్యల్లో మోదీని మరోసారి మెచ్చుకున్నారు. మోదీ మాటల్లో "తాను ఎప్పుడూ ఎన్నికల మోడ్‌లో ఉంటాడని పలువురు చెప్పినా, వాస్తవానికి ప్రజల సమస్యల విషయంలో తాను ఎప్పుడూ భావోద్వేగపూర్వక దృష్టికోణంలో ఉంటాడని" పేర్కొన్నారని థరూర్ చెప్పారు. దేశ విద్యావ్యవస్థపై వలస పాలన మిగిల్చిన ప్రభావాన్ని మోదీ ప్రస్తావించిన విధానం తనకు గుర్తొచ్చిందని కూడా ఆయన తెలిపారు.
వివరాలు
వారసత్వం, భాషలు, విజ్ఞాన వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలన్న శశిథరూర్
వలసవాదపు మనస్తత్వం నుంచి పూర్తిగా బయటపడాలంటే భారతీయ వారసత్వం, స్వదేశీ భాషలు, సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలను మళ్లీ వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారని థరూర్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందమని చెప్పారు. అలాగే, ప్రధాని మోదీతో ఉన్న కొన్ని ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అయితే థరూర్ ఈ పోస్టు చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయన అసలు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారట. ఇటీవలి నెలలుగా థరూర్ తరచూ మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తుండటం పార్టీ వర్గాల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది.