Passports: ప్రపంచంలో భారత పాస్‌పోర్ట్‌కు ఎంత బలం ఉంది..?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని పాస్‌పోర్ట్‌ల సామర్థ్యాన్ని కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాల ఆధారంగా మాత్రమే కాకుండా, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలత, జీవన ప్రమాణాలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index-GPI) 2026 నివేదిక తాజాగా వెలువడింది. ఈసారి కూడా యూరప్ దేశాలే ఆధిపత్యాన్ని కొనసాగించాయి. టాప్-10 ర్యాంకుల్లో తొమ్మిది స్థానాలను యూరోపియన్ దేశాలు దక్కించుకోగా, ఆసియా ఖండం నుంచి సింగపూర్ ఒక్కటే ఈ జాబితాలో స్థానం సంపాదించింది.
వివరాలు
200 దేశాలకు ర్యాంకులు..
ఈ సూచికలో మొత్తం 200 దేశాలకు ర్యాంకులు కేటాయించగా, భారత్ 125వ స్థానంలో నిలిచింది. మొబిలిటీ (ప్రయాణ స్వేచ్ఛ) విభాగంలో భారత్‌కు 135వ స్థానం లభించగా, జీవన నాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) విభాగంలో 118వ స్థానంలో ఉంది. ఇటీవల సంవత్సరాల్లో అనేక దేశాలు తమ పౌరులకు అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించినప్పటికీ, అదే స్థాయిలో భారత్ పురోగతి సాధించలేదని ఈ నివేదిక వెల్లడించింది.
వివరాలు
80వ స్థానంలో భారత్..
మరోవైపు, కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాలను మాత్రమే ప్రమాణంగా తీసుకునే హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ ప్రస్తుతం 80వ స్థానంలో ఉంది. జూలై 2026లో విడుదలైన తాజా అప్‌డేట్ ప్రకారం, భారత పాస్‌పోర్ట్ కలిగిన వారు ప్రపంచంలోని 56 దేశాలకు వీసా-ఫ్రీ లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించే అవకాశం పొందుతున్నారు. ఈ జాబితాలోని దేశాల్లో ఎక్కువ భాగం ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందినవే. అయితే అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌తో పాటు చాలా యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే భారతీయులు ఇప్పటికీ ముందుగానే వీసా పొందాల్సి ఉంటుంది.