Global rice prices: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో బియ్యం ధరలకు మంట.. 50% పెరుగుదలపై పీజేటీఏయూ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వరి ఉత్పత్తి తగ్గిపోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ స్థాయిలో వర్షాలు కురవకపోతే ఈ ఏడాది కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు నీటి వినియోగం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాయి. దీంతో వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు ధాన్యం ఉత్పత్తి కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ బియ్యం మార్కెట్‌పై ఎల్‌నినో ప్రభావాన్ని విశ్లేషిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) కీలక అధ్యయన నివేదికను విడుదల చేసింది.
వివరాలు
బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం
ఎల్‌నినో కారణంగా ధాన్యం ఉత్పత్తి తగ్గే పరిస్థితులు ఏర్పడితే, ప్రధాన దిగుమతి దేశాలు ముందస్తు జాగ్రత్తగా భారీ స్థాయిలో బియ్యం నిల్వలు పెంచుకునే అవకాశం ఉందని, అలాంటి పరిణామాలు చోటుచేసుకుంటే ప్రపంచ బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశముందని నివేదిక హెచ్చరించింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు గత కొన్నేళ్ల కనిష్ఠ స్థాయిలో ఉన్నప్పటికీ, ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రమైతే పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయే అవకాశముందని అధ్యయనం స్పష్టం చేసింది.
వివరాలు
భౌగోళిక,ఆర్థిక పరిస్థితుల ప్రభావం
అధ్యయనం ప్రకారం భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, ఎరువుల ధరల పెరుగుదల, ఇంధన వ్యయం అధికమవడం వంటి అంశాలతో పాటు ఆసియాలోని ప్రధాన వరి పండించే ప్రాంతాలపై ఎల్‌నినో ప్రభావం ప్రపంచ బియ్యం మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.
ప్రస్తుతం సరఫరా పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలను సూచించే పలు హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది.
మూడు పరిస్థితులపై అంచనాలు
ప్రపంచ బియ్యం మార్కెట్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అధ్యయనం మూడు వేర్వేరు పరిస్థితులను విశ్లేషించింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు పెరిగే అవకాశం
వరి ఉత్పత్తి స్థిరంగా కొనసాగి, ఎగుమతి దేశాలు ఎలాంటి ఆంక్షలు విధించకుండా, దిగుమతి దేశాలు భయంతో అదనపు నిల్వలు పెంచుకోకుండా ఉంటే బియ్యం ధరలు 10 నుంచి 20 శాతం వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉందని అధ్యయనం తెలిపింది.
ఎల్‌నినో ప్రభావంతో వరి ఉత్పత్తి మోస్తరు స్థాయిలో తగ్గడం, ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలు ముందస్తు జాగ్రత్తగా బియ్యం నిల్వలు పెంచుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే అంతర్జాతీయ మార్కెట్లో బియ్యం ధరలు 30 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశముందని అంచనా వేసింది.
వివరాలు
అత్యంత ప్రతికూల పరిస్థితి:
ఎల్‌నినో ప్రభావంతో వరి పంట తీవ్రంగా దెబ్బతినడం, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులపై ఆంక్షలు అమలు కావడం, భయాందోళనలతో దేశాలు భారీ స్థాయిలో బియ్యం కొనుగోళ్లు చేపట్టడం జరిగితే ప్రపంచ బియ్యం ధరలు 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరిగే ప్రమాదం ఉందని అధ్యయనం హెచ్చరించింది.
వివరాలు
భారత్ పాత్ర కీలకం
ఎల్‌నినో ప్రభావం మరింత తీవ్రమైతే అంతర్జాతీయ సహకారం, పారదర్శక వాణిజ్య విధానాలు, సకాలంలో మార్కెట్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం ద్వారా మాత్రమే బియ్యం మార్కెట్‌ను స్థిరంగా ఉంచగలమని పీజేటీఏయూ సూచించింది.
ప్రపంచ బియ్యం ఉత్పత్తి, ఎగుమతులు, ప్రభుత్వ ధాన్య నిల్వల నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అధ్యయనం పేర్కొంది.
దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని భారత్ బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించే పరిస్థితి ఏర్పడితే, ప్రపంచ మార్కెట్లో సరఫరా మరింత తగ్గి బియ్యం ధరలు ఇంకా వేగంగా పెరిగే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేసింది.