Delhi: గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసు: సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
గోవాలోని ఆర్పోరా బీచ్ వద్ద ఉన్న'బిర్చ్ బై రోమియో లేన్'నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సహ యజమాని అజయ్ గుప్తాను మంగళవారం ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత పట్టుకున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. "ఈ కేసులో అజయ్ గుప్తా ఆరో నిందితుడిగా పట్టుబడ్డాడు"అని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మోడక్,జనరల్ మేనేజర్ వివేక్ సింగ్,బార్ మేనేజర్ రాజీవ్ సింగానియా,గేట్ మేనేజర్ రియాన్షు ఠాకూర్,ఉద్యోగి భరత్ కోహ్లీ లను పోలీసులు అరెస్టు చేయగా,మరో సహయజమాని సురిందర్ కుమార్ ఖోస్లా పరారీలో ఉన్నాడు.అతనిపైనా ఎల్ఓసీ జారీ చేశారు.
వివరాలు
థాయిలాండ్ పారిపోయిన సౌరభ్,గౌరవ్ లూత్రా
ఇదిలా ఉండగా,ఇంకో ఇద్దరు సహ యజమానులైన సౌరభ్,గౌరవ్ లూత్రా ఫూకెట్ (థాయిలాండ్) కు పరారయ్యారు. వారిపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ అయ్యింది. అగ్నిప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ఢిల్లీ నుంచి ఫూకెట్‌కి వెళ్లిపోయిన లూత్రా సోదరులు,పరారీలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టడం విశేషంగా మారింది. మరోవైపు,రోమియో లేన్‌కి చెందిన వాగటార్ బీచ్ ప్రాపర్టీలో కూడా అగ్ని భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు,ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆ భవనాన్ని కూల్చివేయాలని ఆదేశించగా,"బీచ్ వైపు ఉన్న ఆక్రమణను తొలగిస్తాం... మొత్తం 198 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని కూల్చివేయనున్నాం" అని గోవా టూరిజం ఉప సంచాలకుడు ధీరజ్ వాగళే తెలిపారు.