Godavari: వరదలతో ఎర్రగా మారిన ప్రవాహం.. రెండు రంగుల్లో కనిపిస్తున్న గోదావరి
ఈ వార్తాకథనం ఏంటి
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ఆలయం నది మధ్యలో ఉండటంతో ప్రస్తుతం అక్కడికి చేరుకోవడం కష్టంగా మారింది. వరద ప్రవాహంలో మట్టి కలిసిపోవడంతో ఆ దారిలో ప్రవహిస్తున్న నీరు ఎర్రటి వర్ణాన్ని సంతరించుకుంది.
వివరాలు
గూటాల వద్ద రెండు రంగుల్లో మెరిసిన గోదావరి
ఈ ఎర్రని నీరు పట్టిసీమలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం ముందు భాగం గుండా ప్రవహిస్తోంది. అదే సమయంలో ఆలయం వెనుక వైపు నుంచి వస్తున్న మరో ప్రవాహం మాత్రం సహజసిద్ధమైన నీలి వర్ణంలో కొనసాగుతోంది. ఈ రెండు ప్రవాహాలు గూటాల సమీపంలో ఒకే చోట కలుస్తుండటంతో గోదావరి నది రెండు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒకవైపు ఎర్రటి నీరు, మరోవైపు నీలి వర్ణపు నీరు కలిసే దృశ్యం ప్రస్తుతం స్థానికులను, పర్యాటకులను ఆశ్చర్యానికి గురిచేస్తూ కనువిందు చేస్తోంది.