LOADING...
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటినుంచే సక్రమ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు మంత్రివర్గం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రధాన ఆలయాలు,పురాతన దేవాలయాలు, ఎకో టూరిజం కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. ఈపనుల కోసం త్వరలోనే క్యాబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేయనుంది. అలాగే బాసర-భద్రాచలం మధ్య టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి సంబంధించి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించింది. దేవాదాయ,రెవెన్యూ,అటవీ, పర్యాటక, పురావస్తు శాఖలు కలిసి మార్చి 31 నాటికి పూర్తి నివేదికను రూపొందించాలని క్యాబినెట్ ఆదేశించింది.

వివరాలు 

గిరిజన ప్రాంతంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం

సమ్మక్క-సారలమ్మ మహాజాతర నేపథ్యంలో, ములుగు జిల్లా మేడారంలోని హరిత హోటల్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. హైదరాబాద్ వెలుపల, అదీ మారుమూల గిరిజన ప్రాంతంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు విదేశాలకు వెళ్లడంతో క్యాబినెట్ సమావేశానికి హాజరుకాలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వివరాలు 

పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం

సమావేశం అనంతరం ఎంపీ బలరాం నాయక్తో కలిసి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క విలేకరుల సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. "ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, ప్రత్యేక తెలంగాణలో గానీ ఎప్పుడూ జరగని విధంగా... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో 27వ క్యాబినెట్ సమావేశాన్ని గిరిజనులు, ఆదివాసీల ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం పుణ్యక్షేత్రంలో నిర్వహించాం. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పునరుద్ధరించిన మేడారం ఆలయాన్ని సోమవారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సహచర మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నాం" అని వారు తెలిపారు.

Advertisement

వివరాలు 

మంత్రిమండలిలో చర్చించిన ముఖ్యాంశాలివీ...

మున్సిపల్ ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలు ఉన్నందున ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా షెడ్యూల్ రూపొందించాలని అధికారులకు సూచించింది. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 ప్రాజెక్టును ఎల్ అండ్ టి నుంచి స్వాధీనం చేసుకునే ప్రక్రియపై ఇప్పటివరకు జరిగిన పురోగతిని సమీక్షించి, ఈ చర్యలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మెట్రో ఫేజ్-2ఎలోని నాలుగు కారిడార్లు, ఫేజ్-2బిలోని మూడు కారిడార్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, ఈలోపు భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.2,787 కోట్ల అంచనా వ్యయంతో భూసేకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

Advertisement

వివరాలు 

మంత్రిమండలిలో చర్చించిన ముఖ్యాంశాలివీ...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు 14ప్రాంతాల్లో భూముల కేటాయింపుకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఎకో టౌన్ అభివృద్ధి కోసం టీజీఐఐసీకి 494 ఎకరాల భూమి కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లేఅవుట్ రోడ్ వరకు 9కిలోమీటర్ల మేర కొత్త హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామప్ప జలాశయంలోని గోదావరి జలాలను లక్నవరం,అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా జంపన్నవాగుకు తరలించేందుకు రూ.35కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుతో జంపన్నవాగులో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటుంది.భవిష్యత్‌లో మేడారాన్ని తిరుమల,కుంభమేళాను మించేలా అభివృద్ధి చేయాలన్న లక్ష్యాన్ని క్యాబినెట్ స్పష్టం చేసింది.

వివరాలు 

మంత్రిమండలిలో చర్చించిన ముఖ్యాంశాలివీ...

నల్గొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీ లా కాలేజీలో 24, ఫార్మసీ కాలేజీలో 28 కొత్త పోస్టుల మంజూరుకు, అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం తెలిపింది. హ్యామ్ రోడ్లకు సంబంధించి ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 6 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల పనులకు రూ.11,399 కోట్ల అంచనాతో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే పంచాయతీరాజ్ శాఖలో రూ.6 వేల కోట్ల వ్యయంతో పనులను త్వరగా ప్రారంభించాలని నిర్ణయించింది.

వివరాలు 

మంత్రిమండలిలో చర్చించిన ముఖ్యాంశాలివీ...

ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలను నింపడంతో పాటు 7,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. దీనికి రూ.143 కోట్ల అంచనా వ్యయం కేటాయించారు.

Advertisement