Loading...
Agniveer Marriage Rules: అగ్నివీరులకు నేవీ గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల సర్వీసులో పెళ్లికి అనుమతి
అగ్నివీరులకు నేవీ గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల సర్వీసులో పెళ్లికి అనుమతి

Agniveer Marriage Rules: అగ్నివీరులకు నేవీ గుడ్‌న్యూస్‌.. రెండేళ్ల సర్వీసులో పెళ్లికి అనుమతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్నివీరులకు భారత నౌకాదళం శుభవార్త చెప్పింది. తొలి నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత మరో రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగేందుకు అంగీకరించిన అగ్నివీరులు ఆ సమయంలో వివాహం చేసుకునేందుకు అనుమతించింది. అలాగే, పొడిగించిన రెండేళ్ల సర్వీసు సమయంలో పెళ్లి చేసుకుని గర్భం దాల్చిన మహిళా అగ్నివీరులకు పూర్తిస్థాయి ప్రసూతి ప్రయోజనాలు, సెలవులు వర్తిస్తాయని ప్రకటించింది.

వివరాలు

నాలుగేళ్ల సర్వీసులో పెళ్లికి అనుమతి లేదు

అగ్నిపథ్‌ పథకం కింద 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులను అగ్నివీరులుగా నియమిస్తున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ప్రారంభ నాలుగేళ్ల సర్వీసు కాలంలో అగ్నివీరులు వివాహం చేసుకోవడానికి అనుమతి లేదు.

ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లి చేసుకుంటే విధుల నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది.

అయితే తాజాగా రెండేళ్ల సర్వీసు పొడిగింపునకు సంబంధించి నౌకాదళం ఈ నిబంధనలో వెసులుబాటు కల్పించింది.

నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని, మరో రెండేళ్ల పొడిగింపునకు అంగీకరించిన వారు వివాహం చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

వివరాలు

శిక్షణ పూర్తయ్యాకే పెళ్లికి అనుమతి

ఈ వెసులుబాటుకు నేవీ కొన్ని షరతులు విధించింది. రెండేళ్ల సర్వీసు పొడిగింపునకు ఎంపికైన అగ్నివీరులు ముందుగా తప్పనిసరి ప్రారంభ శిక్షణను పూర్తి చేయాలి.

ఈ శిక్షణలో వృత్తిపరమైన అంశాలతో పాటు వారు ఎంపికైన విభాగానికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది.

అది పూర్తయిన తర్వాత వివాహం కోసం తమకు అర్హత ఉన్న సెలవులను వినియోగించుకోవచ్చని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ADVERTISEMENT

వివరాలు

నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు సర్వీసు కాలం

కేంద్ర ప్రభుత్వం ఇటీవల అగ్నివీరుల సర్వీసు కాలాన్ని నాలుగేళ్ల నుంచి ఆరేళ్లకు పెంచే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

తొలి నాలుగేళ్ల సర్వీసు తర్వాత ప్రతిభ ఆధారంగా 25 శాతం మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పించనున్నారు.

మిగిలిన 75 శాతం మందికి మరో రెండేళ్ల పాటు సర్వీసు చేసే అవకాశం కల్పించారు. ఆ తర్వాత అర్హతలు, ఆసక్తి ఆధారంగా శాశ్వత సైనిక ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఈ నేపథ్యంలో వివాహానికి సంబంధించి నౌకాదళం తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

నేవీ తర్వాత భారత సైన్యం (Army), వైమానిక దళం (Air Force) కూడా తమ నిబంధనలకు అనుగుణంగా ఇలాంటి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.

ADVERTISEMENT