LOADING...
New Pensions in Telangana : వారందరికీ గుడ్‌న్యూస్.. 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి తేదీ ఖరారు!
వారందరికీ గుడ్‌న్యూస్.. 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి తేదీ ఖరారు!

New Pensions in Telangana : వారందరికీ గుడ్‌న్యూస్.. 2 లక్షల కొత్త పెన్షన్ల పంపిణీకి తేదీ ఖరారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 24, 2026
09:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త అందింది. రాష్ట్రంలో 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పెన్షన్ల పంపిణీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న అంశంపై స్పష్టత వచ్చింది. ఈ ఏడాది జూన్ 2న జరగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కొత్త పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించారు. మే నెలలోనే పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది.

వివరాలు

దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్‌కు అర్హులైన కొత్త లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో డెత్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో దాదాపు 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్ లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇక కొత్తగా ఆసరా పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ దరఖాస్తులను ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు మున్సిపల్ కార్యాలయాలకు దరఖాస్తులు ఇవ్వాలి. అధికారులు ఈ దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు.

వివరాలు

అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు

అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి మండలం నుంచి అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందించాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, కొత్త పెన్షన్ మంజూరుకు సంబంధించి డీఆర్డీఓ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి పరిశీలన వేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు నిజంగా అర్హులా, వారు నివసిస్తున్న ప్రదేశం ఏదన్న అంశాలపై అధికారులు సమగ్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో కూడా అధికారులు స్వయంగా వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియపై మే రెండో వారానికి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement