LOADING...
Cotton Farmers: పత్తి రైతులకు శుభవార్త.. రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పత్తి రైతులకు శుభవార్త.. రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Cotton Farmers: పత్తి రైతులకు శుభవార్త.. రేపటి నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పత్తి రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రేపటి నుంచే పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. పత్తికి కనీస మద్దతు ధరను రూ.8,110గా నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. తక్షణమే పత్తి సేకరణ ప్రక్రియను ప్రారంభించాలని సీసీఐ (CCI) అధికారులకు ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలో మొత్తం 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారని మంత్రి పేర్కొన్నారు.

Details

రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

రైతులు తమ వివరాలను ముందుగా రైతు సేవా కేంద్రాల ద్వారా సీఎం యాప్‌లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (VAA) సహాయంతో నమోదు చేసుకోవాలని, ఆ తర్వాత "కపాస్ కిసాన్" యాప్‌లో అదే వీఏఏ సహకారంతో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. ఇక మొంథా తుపాను తీవ్రత పెరగనున్నా రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో కూడా తీవ్ర ప్రకృతి విపత్తులను సీఎం చంద్రబాబు నాయకత్వంలో విజయవంతంగా ఎదుర్కొన్నామన్నారు. ఈసారి కూడా ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలతో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఆయన చెప్పారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు, సిబ్బంది అందరినీ అప్రమత్తం చేశామని, పంటల ప్రాథమిక నష్ట అంచనా నివేదికలు సేకరించామన్నారు.

Details

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

ముంపు ప్రాంతాలను ముందుగానే గుర్తించి, నష్టం నివారణ చర్యలు చేపట్టామని వివరించారు. రైతులు ఎలాంటి భయాందోళన చెందవద్దని మంత్రి సూచించారు. శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పంట నష్టం తగ్గించే సూచనలు ఇస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా 24×7 సలహాలు అందిస్తున్నామని తెలిపారు. తుపాను అనంతరం నష్టం వాటిల్లిన ప్రతి రైతును ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకారులను వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశామని, వారి వలలు, బోట్ల రక్షణ కోసం చర్యలు తీసుకున్నామని, మూగజీవుల ప్రాణ నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.