Medaram Special Trains: మేడారం జాతరకు వెళ్లే భక్తులకు శుభవార్త.. 28 ప్రత్యేక రైళ్లతో రైల్వే భారీ ఏర్పాట్లు!
ఈ వార్తాకథనం ఏంటి
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. జాతర సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని వరంగల్, కాజీపేట కేంద్రాలుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు సులభంగా మేడారం చేరుకునేలా మొత్తం 28 స్పెషల్ ట్రైన్స్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు జనవరి 28, 29 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మేడారంకు నేరుగా రైల్వే లైన్ లేకపోవడంతో, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి వరంగల్, కాజీపేట వరకు ఈ రైళ్లను నడపనున్నారు. అక్కడి నుంచి మేడారంకు చేరుకునేందుకు ఆర్టీసీతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Details
రైలు దిగగానే భక్తులు నేరుగా బస్సులు ఎక్కేలా ప్రత్యేక బస్ పాయింట్లు
వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లలో రైలు దిగగానే భక్తులు నేరుగా బస్సులు ఎక్కేలా ప్రత్యేక బస్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పాయింట్ల వద్ద ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నిరంతరం అందుబాటులో ఉంటాయి. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేడారం చేరుకునే అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్ రూట్లలో, నిజామాబాద్ నుంచి వరంగల్ మార్గంలో, కాజీపేట నుంచి ఖమ్మం, ఆదిలాబాద్ వైపుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. దీని వల్ల రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఈ రైలు-బస్ కనెక్టివిటీ ఎంతో ఉపయోగపడుతుందని రైల్వేశాఖ వెల్లడించింది.
Details
అందుబాటులో మరిన్ని సర్వీసులు
భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, రైలు-ఆర్టీసీ బస్సుల మధ్య సమన్వయం పెంచాలని నిర్ణయించారు. ఈ ఏర్పాట్లతో మేడారం జాతరకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.