
Rains: రైతన్నలకు గుడ్‌న్యూస్.. ఈసారి సగటు కంటే 105% ఎక్కువ వర్షపాతం!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో, ఇక్కడి ప్రజల వర్షాలపై ఆధారపడి ఉంటారు.
పంటలు పుష్కలంగా పండేందుకు సమయానికి వర్షాలు కురవడం ఎంతో కీలకం.
ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అందించింది. రానున్న వర్షాకాలంలో మాన్సూన్ జోరుగా కురుస్తుందని స్పష్టం చేసింది.
IMD తాజా అంచనా ప్రకారం, 2025 రుతుపవన సీజన్‌లో సగటు కంటే 105 శాతం అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
అయితే లడఖ్, ఈశాన్య భారతం, తమిళనాడులో మాత్రం వర్షాలు కొంత తగ్గే అవకాశం ఉందని సూచించింది. ఎల్ నినో, హిందూ మహాసముద్ర ద్విధ్రువ ప్రభావాలు ఈసారి సాధారణంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపింది.
దేశవ్యాప్తంగా మాన్సూన్ మరింత ప్రభావవంతంగా ఉండనుందని అంచనా వేసింది.
Details
సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం
యురేషియా, హిమాలయాల్లో మంచు మోతాదులో తగ్గుదల కూడా వర్షపాతాన్ని పెంచే అంశంగా నిపుణులు చెబుతున్నారు.
వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, 2025లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని చెప్పారు.
దీర్ఘకాలిక సగటు వర్షపాతం 87 సెం.మీ. కాగా, ఈ ఏడాది దానిలో 105 శాతం నమోదవుతుందని అంచనా. ఇది రైతులకే కాదు, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకూ ఊరటను కలిగించనుంది.
అయితే ఏప్రిల్ నుంచి జూన్ వరకు తీవ్రమైన వేడి కొనసాగనుందని ఆయన హెచ్చరించారు. సాధారణంగా రుతుపవనాలు జూన్ చివరలో కేరళ తీరంలో ప్రవేశించి జూలై మధ్య నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.