PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
ఈ వార్తాకథనం ఏంటి
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కొనసాగింపునకు రూ.3,15,614 కోట్లు కేటాయించనుంది. అదే సమావేశంలో జల వనరులపై తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి 'ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన (PMSSY)' పేరుతో కొత్త పథకానికి కూడా ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.5,070 కోట్లు కేటాయించింది. మరోవైపు దేశీయ చమురు, సహజ వాయువు ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో 'సముద్ర మంథన్' కార్యక్రమాన్ని రూ.84,084 కోట్ల వ్యయంతో ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వివరాలు
జల వనరులపై ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు
క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం, జాతీయ క్రీడా సమాఖ్యల ప్రోత్సాహక కార్యక్రమాల కోసం రూ.36,441 కోట్లు ఖర్చు చేయాలని కూడా నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మొత్తం రూ.4,41,209 కోట్ల విలువైన పథకాలకు ఆమోదం లభించింది.
ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజన కింద దేశవ్యాప్తంగా జలాశయాలు, రిజర్వాయర్లపై 5,000 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం దేశంలో ఉన్న 700 మెగావాట్ల సామర్థ్యంతో పోలిస్తే ఇది ఏడు రెట్లకు పైగా పెరుగుదల. ఈ పథకం కింద ప్రతి మెగావాట్‌కు రూ.1 కోటి వరకు కేంద్రం ఆర్థిక సాయం అందించనుంది.
వివరాలు
రైతులకు ఉపయోగకరం
ప్రతి ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్టులో కనీసం రెండు గంటలపాటు విద్యుత్‌ను నిల్వ చేసే ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ తప్పనిసరిగా ఉంటుంది.
దీని ద్వారా 10,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం ఏర్పడి, పీక్ డిమాండ్ సమయంలో రాష్ట్రాలకు ఉపయోగపడుతుంది.
టారిఫ్ ఆధారిత బిడ్డింగ్ విధానంలో ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని రిజర్వాయర్లు, పారిశ్రామిక నీటి వనరుల్లో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయవచ్చు.
ఈ పథకం పూర్తిగా అమలైతే సుమారు 17 వేల ఉద్యోగాలు సృష్టించబడతాయని కేంద్రం అంచనా వేస్తోంది.
రిజర్వాయర్లలో నీటి ఆవిరి తగ్గడానికీ ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి.
2026-27 నుంచి 2030-31 మధ్య ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వగా, కేంద్ర ఆర్థిక సాయం 2032-33 వరకు కొనసాగుతుంది.
వివరాలు
పీఎం కిసాన్ మరో ఐదేళ్లు
రైతులకు ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున మూడు విడతల్లో ఏడాదికి రూ.6,000 అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.
ఈ పథకం కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రూ.4.47 లక్షల కోట్లు వ్యయం చేసింది.
ఇప్పుడు 2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకాన్ని కొనసాగించేందుకు మరో రూ.3.15 లక్షల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ, పీఎం కిసాన్ అమలులోకి వచ్చిన తర్వాత 85 శాతం మంది లబ్ధిదారులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకోవడం తగ్గిందని తెలిపినట్లు వెల్లడించారు.
వివరాలు
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడలకు భారీ కేటాయింపులు
రాబోయే ఐదేళ్లలో ఖేలో ఇండియా పథకం కోసం రూ.29,054 కోట్లు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది.
ఇది గత కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ. అదే విధంగా జాతీయ క్రీడా సమాఖ్యల (National Sports Federations) పథకం కింద రూ.7,387 కోట్లు మంజూరు చేయనుంది.
ఖేలో భారత్ నీతి-2025, జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా ఈ నిధులు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.
2030 కామన్‌వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు భారత్ బిడ్డింగ్ దాఖలు చేయనున్న నేపథ్యంలో క్రీడా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
'సముద్ర మంథన్'తో ఇంధన ఉత్పత్తికి ఊతం
దేశీయ చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం 'సముద్ర మంథన్' కార్యక్రమానికి ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమంలో భాగంగా: ఆఫ్‌షోర్ సీస్మిక్ డేటా సేకరణకు రూ.28,500 కోట్లు
ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్‌ను వేగవంతం చేసేందుకు రూ.43,200 కోట్లు * మౌలిక వసతుల ఆధారిత ఉత్పత్తికి రూ.10,000 కోట్లు
ఆయిల్ అండ్ గ్యాస్ తయారీ, సర్వీస్ జోన్‌ల కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు.
ఈ కార్యక్రమం ద్వారా 1 బిలియన్ టన్నుల నుంచి 1.6 బిలియన్ టన్నుల ఇంధనానికి సమానమైన హైడ్రోకార్బన్ నిల్వలను వెలికితీయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.