
Minister Narayana: రైతులకు గుడ్ న్యూస్.. రూ.20వేలు ఇచ్చేది అప్పుడే!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ పర్యటించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమైన మంత్రి, గత ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం కోలుకుంటోందని పేర్కొన్నారు. ఆగస్ట్ 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలు సహా కలిపి, మొత్తం రూ.20 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తల్లికి వందనం పథకం ద్వారా ఇప్పటివరకు రూ.10 వేల కోట్లను విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశామని వివరించారు.
Details
నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన
మున్సిపల్ ఎన్నికల అంశంపై మాట్లాడుతూ మరో రెండు-మూడు నెలల్లో కోర్టు సమస్యలు పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని, మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలపడంతో, ఆర్థిక శాఖతో చర్చించి నాలుగైదు రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తామన్నారు. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇక టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎవరు తప్పు చేసినా, అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. రాష్ట్ర పాలనను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు.