Telangana Govt : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. కీలక నిబంధనలు సడలించిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం'ను వేగవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 9,456 ఇళ్లు మంజూరు కాగా, వాటిలో పలు ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే, ప్రభుత్వం విధించిన కొన్ని కఠిన నిబంధనల కారణంగా అనేక లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడానికి, అడ్డుగా ఉన్న నిబంధనలను ప్రభుత్వం సడలించింది.
Details
కొత్త మార్గదర్శకాలు జారీ
పేదలకు త్వరగా నీడ కల్పించాలన్న సంకల్పంతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 400 నుండి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్లు నిర్మించాలన్న నిబంధన అమలులో ఉంది. దీనివల్ల నిర్ణీత స్థల పరిమాణం లేని లబ్ధిదారులు అనుమతులు పొందడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇప్పుడు ప్రభుత్వం 400 చదరపు అడుగులు (సుమారు 44.4 చదరపు గజాలు) స్థలం ఉన్నవారు కూడా 'జీ ప్లస్ వన్' (G+1) విధానంలో ఇళ్లు నిర్మించుకునేలా అనుమతించింది
Details
ఎలా చేయాలంటే
జీ ప్లస్ వన్ విధానంలో ఇల్లు కట్టాలనుకునే లబ్ధిదారులు ముందుగా గృహనిర్మాణ శాఖ డిప్యూటీ ఈఈ నుండి అనుమతి పొందాలి. అనుమతి పొందిన తర్వాతే నిర్మాణ పనులు ప్రారంభించాలి. కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇళ్లు తప్పనిసరిగా 'ఆర్‌సీసీ ఫ్రేమ్ నిర్మాణం'లో ఉండాలి. అదనంగా ప్రతి ఇంటిలో వంటగది, మరుగుదొడ్డి ఉండడం తప్పనిసరి.
Details
నిబంధనలు ఇవే
చిన్న ప్లాట్లలో ఇందిరమ్మ ఇళ్లను జీ ప్లస్ వన్ పద్ధతిలో నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కనీస కార్పెట్ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలి. ఇంటిలో తప్పనిసరిగా కిచెన్, బాత్‌రూమ్, టాయిలెట్ ఉండాలి. గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ నిర్మాణం పూర్తి చేసిన తరువాత రూ. 1 లక్ష విడుదల చేస్తారు. మొదటి అంతస్తు రూఫ్ లెవెల్ వరకు కాలమ్స్ నిర్మించిన తరువాత మరో రూ. 1 లక్ష ఇస్తారు. గోడలు పూర్తయ్యాక రూ. 2 లక్షలు, నిర్మాణం పూర్తయిన అనంతరం మరిన్ని రూ. 1 లక్ష నగదు రూపంలో విడుదల చేస్తారు. ఇలా, నిబంధనలను సడలించి, పేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చడంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.