TG Inter Result Date 2026: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఫలితాలు ఎప్పుడు అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు, తల్లిదండ్రులందరి దృష్టి ఇప్పుడు ఫలితాలపైనే నిలిచింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలకు సంబంధించి ఇంటర్ బోర్డు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తిస్థాయి పారదర్శకతతో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
వివరాలు
ఏప్రిల్ 10 లోపు ఫలితాలు
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జవాబు పత్రాల మూల్యాంకనం శరవేగంగా కొనసాగుతోంది. ఏప్రిల్ 3 నాటికి వాల్యుయేషన్ ప్రక్రియను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనంతరం కోడింగ్, డీకోడింగ్ వంటి సాంకేతిక ప్రక్రియలను మూడు రోజుల్లో ముగించి, ఏప్రిల్ 6, 8 లేదా 9 తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటును బట్టి తుది తేదీని ఖరారు చేయనున్నారు. మొత్తం మీద ఏప్రిల్ 10 లోపు విద్యార్థులకు మార్కుల జాబితా అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
వివరాలు
ఈసారి డబుల్ వాల్యుయేషన్
గతంలో ఫలితాల విషయంలో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జవాబు పత్రాన్ని రెండుసార్లు మూల్యాంకనం చేసే విధానాన్ని అమలు చేస్తోంది. తుది ఫలితాల ప్రకటనకు ముందు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయి పరిశీలన జరిపిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు
వివరాలు
కట్టుదిట్టమైన భద్రత
వాల్యుయేషన్ కేంద్రాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతరం పర్యవేక్షణ జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం కొనసాగుతోంది. ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు ఉన్నతాధికారులు మొత్తం ప్రక్రియను సమీక్షిస్తున్నారు. కేంద్రాల వద్ద అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు.
వివరాలు
అధ్యాపకులకు ఊరట
మూల్యాంకనంలో పాల్గొనే అధ్యాపకులకు ఈసారి రెమ్యూనరేషన్ పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక్కో అధ్యాపకుడు రోజుకు 25 నుంచి 30 పేపర్లు మాత్రమే దిద్దేలా పరిమితి విధించారు. దీని వల్ల పని భారం తగ్గి, ప్రతి పేపర్‌ను నిశితంగా పరిశీలించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న ఇంటర్ బోర్డు ఈసారి ఎలాంటి వివాదాలకు తావులేకుండా రికార్డు సమయంలోనే ఫలితాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.