Hyderabad: వాహనదారులకు శుభవార్త.. 8 లైన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కసరత్తు!
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు ఎల్‌బినగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు వేగం పుంజుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఛైర్మన్ సంతోష్‌కుమార్ యాదవ్‌తో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే అత్యంత రద్దీ రహదారిగా ఉన్న హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ అంశాన్ని మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఈ మార్గంలో రోజురోజుకూ ట్రాఫిక్ తీవ్రంగా పెరుగుతోందని, తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన వివరించారు.
వివరాలు
వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలి
ప్రమాదాల నివారణతో పాటు రాకపోకలను సులభతరం చేయాలంటే ఈ రహదారిని 8 లైన్లుగా విస్తరించడం అత్యవసరమని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని NHAI అధికారులను కోరారు. ఇక మరోవైపు ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు(RRR)ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే మూడేళ్ల క్రితమే ఆమోదం లభించిందని, ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. భూసేకరణ కూడా చివరి దశకు చేరుకుందని వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్ నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి RRR నిర్మాణ పనులను ప్రారంభిస్తామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.