Imax screen In Hyderabad: సినీ అభిమానులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌కు వస్తున్న ఐమ్యాక్స్ స్క్రీన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు సినీ అభిమానులకు శుభవార్త. ఒకప్పుడు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ మళ్లీ హైదరాబాద్‌లో అందుబాటులోకి రానుంది. దాదాపు పుష్కరకాలం తర్వాత భాగ్యనగర వాసుల చిరకాల కోరిక నెరవేరబోతోంది. హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఏఎంబీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్ సంస్థలు సంయుక్తంగా చేపట్టనున్నాయి. కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్‌ను 'ఏఎంబీ క్లాసిక్ విక్టరీ' పేరుతో సుదర్శన్ 70 థియేటర్‌లో ఏర్పాటు చేయనున్నారు. దీంతో హైదరాబాద్‌లో మరోసారి ప్రపంచ స్థాయి సినిమా వీక్షణ అనుభవం అందుబాటులోకి రానుంది.
వివరాలు
త్వరలోనే మరిన్ని వివరాలు
అయితే ఈ ఐమ్యాక్స్ స్క్రీన్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్క్రీన్ పరిమాణం ఎంత ఉంటుంది? సీటింగ్ సామర్థ్యం ఎంత? వంటి కీలక వివరాలను నిర్వాహకులు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతికతతో కూడిన పలు ప్రీమియం స్క్రీన్‌లు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా డాల్బీ సినిమాస్, ఎపిక్యూ, 4DX, పిక్సెల్ ఫార్మాట్‌లతో కూడిన స్క్రీన్‌లు సినీ ప్రేక్షకులకు అత్యుత్తమ వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే అన్ని ఆధునిక సాంకేతికతలు ఉన్నప్పటికీ, ఐమ్యాక్స్ స్క్రీన్ లేకపోవడం సినీ అభిమానులు చాలాకాలంగా ఫీల్ అవుతున్న లోటుగా మారింది. ఇప్పుడు ఏఎంబీ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, ఐమ్యాక్స్ భాగస్వామ్యంతో ఆ లోటు కూడా త్వరలోనే తీరనుంది.