
Telangana: వేరుసెనగ రైతులకు శుభవార్త.. కాండం కుళ్లు తెగులను నిరోధించే కీలక జన్యువులు గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
వేరుసెనగ రైతులకు శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా వేరుసెనగ పంటకు తీవ్రమైన ముప్పుగా మారిన కాండం కుళ్లు (ఆకుమచ్చ) తెగులను నిరోధించే ముఖ్యమైన జన్యువులను ఇక్కడి శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్వారా ఈ వ్యాధిని నియంత్రించడానికి, పంట రక్షణ చర్యలను సులభంగా చేపట్టే మార్గం రూపొందిందని వారు తెలిపారు. ప్రపంచంలో వేరుసెనగ ప్రధాన నూనె పంటగా నిలుస్తుంది. అయితే ఈ పంటకు కాండం కుళ్లు తెగులు వినాశకారిగా మారింది. వ్యాధి ప్రారంభమైతే అది సుమారు 80 శాతం పంటను ప్రభావితం చేసి ఆరంభ దశలోనే భారీ నష్టం చేస్తుంది. ఈ వ్యాధికి ప్రస్తుతం తగిన మందులు లేవు.
వివరాలు
ఐకార్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కీలక సహకారం
ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి,ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు విస్తృత స్థాయి పరిశోధనలను చేపట్టారు. పరిశోధన ఫలితాల్లో తేలినది ఏమిటంటే,నేల ద్వారా సంక్రమించే 'స్ల్కిరోషీయం రోల్ఫ్‌సీఐ' అనే ఫంగస్ కారణంగా కాండం తెగులు వ్యాధి పంచబడుతుందని గుర్తించారు. వీరి అధ్యయనంలో,వ్యాధి నిరోధకత కలిగిన ఎనిమిది క్రోమోజోమ్‌లలో 13ప్రత్యేక జన్యుభాగాలను గుర్తించడం జరిగింది. వీటిలో 145జన్యువులు రక్షణ సంబంధిత సమ్మేళనాల సంశ్లేషణ,మొక్కల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ తాజా ఆవిష్కరణలను ఇక్రిశాట్ ప్లాంట్ జీనోమ్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనలో భారత వేరుసెనగ పరిశోధన సంస్థ, చైనా వ్యవసాయ శాస్త్రాల సంస్థ, ఎన్జీ రంగా విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. అలాగే, ఈ ప్రాజెక్ట్‌కు ఐకార్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కీలక సహకారం అందించారు.