IRCTC: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. జులై 15 నుంచి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్!
ఈ వార్తాకథనం ఏంటి
రైలు టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. వెబ్‌సైట్ నెమ్మదిగా పనిచేయడం, తత్కాల్ బుకింగ్ సమయంలో సర్వర్లు క్రాష్ కావడం, పేమెంట్ ఫెయిల్యూర్లు వంటి ఇబ్బందులను అధిగమించేందుకు భారతీయ రైల్వేలు కీలక చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను జులై 15 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా కోట్లాది మంది ప్రయాణికులకు మరింత వేగవంతమైన, సులభమైన టికెట్ బుకింగ్ అనుభవం అందించనున్నట్లు తెలిపారు.
వివరాలు
విద్యార్థుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన మంత్రి
జూన్ 11న మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎన్ఐటీ), జైపూర్‌లో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తత్కాల్ బుకింగ్ సమయంలో వెబ్‌సైట్ క్రాష్ అవ్వడం, క్యాప్చా సమస్యలు, డబ్బులు కట్ అయినా టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం వంటి ఇబ్బందులను విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన అశ్విని వైష్ణవ్, అక్కడికక్కడే రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కొత్త వెబ్‌సైట్ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం కేవలం 30 రోజుల్లో కొత్త ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి జులై 15 నాటికి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనకు విద్యార్థులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.
వివరాలు
బుకింగ్ సామర్థ్యంలో భారీ పెరుగుదల
ప్రస్తుతం దేశంలో రైలు టికెట్లలో దాదాపు 88 శాతం ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కొత్త వ్యవస్థలో ప్రస్తుతం నిమిషానికి సుమారు 32,000టికెట్లు బుక్ చేసే సామర్థ్యం ఉండగా, అది 1.5 లక్షలకు పైగా పెరగనుంది. రైళ్ల లభ్యత, వెయిటింగ్ లిస్ట్ తదితర వివరాల కోసం ప్రస్తుతం నిమిషానికి 4 లక్షల విచారణలు నిర్వహించగలుగుతుండగా, కొత్త వ్యవస్థలో అది 40 లక్షలకు పైగా పెరగనుంది. ఈ మార్పులతో పండుగలు, వేసవి సెలవులు, తత్కాల్ బుకింగ్ వంటి అత్యంత రద్దీ సమయాల్లో సర్వర్లు నిలిచిపోవడం, సీట్లు కనిపించకపోవడం వంటి సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు
కొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఇష్టమైన సీటు లేదా బెర్త్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వివిధ తేదీల్లో టికెట్ ధరలను పోల్చి చూసేందుకు 'ఫేర్ క్యాలెండర్' బహుళ ప్రాంతీయ భాషల్లో సేవలు దివ్యాంగులు, విద్యార్థులు, రోగుల కోసం మరింత సరళమైన బుకింగ్ విధానం ఈ సాంకేతిక, సేవా పరమైన మార్పులు రైలు ప్రయాణికులకు టికెట్ బుకింగ్ సమయంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించి, మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయని రైల్వే శాఖ భావిస్తోంది.