రైల్వేశాఖ తీపి కబురు.. ఏసీ ఛైర్ కార్ టికెట్లపై భారీ తగ్గింపు
ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధరలను తగ్గిస్తూ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. అయా తరగతులు కలిగిన అన్ని రైళ్లలో టికెట్ ధరపై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. వందే భారత్ సహా అనుభూమి, విస్టాడోమ్ కోచ్ లు కలిగిన రైళ్లకు ఇది వర్తించనుంది. ఆక్యుపెన్సీ ఆధారంగా టికెట్ ధరలపై ఈ డిస్కౌంట్ ను అందించనున్నారు. టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ఆయా రైల్వే జోన్లలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు రైల్వే శాఖ కట్టబెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని రూట్లలో బాగా డిమాండ్ ఉన్నా, మరికొన్ని రూట్లలో మాత్రం టికెట్ ధరలు అధికంగా ఉండటంతో ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటోంది.
స్పెషల్ రైళ్లకు నో డిస్కౌంట్
వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ఏసీ బోగీల్లో, ఛైర్ కార్లలో ప్రయాణానికి చాలామంది ప్రయాణికులు వెనకడుగు వేస్తున్నారు. దీంతో రైల్వే బోర్డు కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. అనుభూతి, విస్టాడోమ్ కోచ్‌లు కలిగిన రైళ్లు సహా ఏసీ ఛైర్ కార్, ఎగ్జిక్యూటివ్ తరగుతులు కలిగిన అన్ని రైళ్లకూ ఈ స్కీమ్ వర్తిస్తుందని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ఈ డిస్కౌంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తించదని పేర్కొంది. అదే విధంగా హాలిడే, ఫెస్టివల్ స్పెషల్ రైళ్లకు ఈ స్కీమ్ వర్తించదు.