త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు రానున్నాయ్
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మూడు కొత్త ఫార్మాట్లలో ప్రవేశపెట్టేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా సుదూర మార్గాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని కేంద్రం యోచిస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల మొదటి బ్యాచ్‌ను కేంద్రం వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి స్లీపర్ వేరియంట్ వందే భారత్ రైళ్ల డిజైన్‌ను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) సిద్ధం చేస్తోందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. మొదటి బ్యాచ్ కింద కొన్ని రైళ్లను మార్చి 2024 నాటికి సిద్ధంగా ఉంటాయని ఆయన చెప్పారు.
550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే మార్గాల్లో వందే స్లీపర్స్
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి వందే భారత్ రైళ్లు వందే చైర్ కార్, వందే మెట్రో, వందే స్లీపర్స్ మూడు వెర్షన్‌లు అందుబాటులోకి వస్తాయని కేంద్ర రైల్వే మంత్రి తెలిపారు. 100 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారి కోసం వందే మెట్రో, 100-550 కిలోమీటర్లు వెళ్లేవారి కోసం వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారి కోసం వందే స్లీపర్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. జూన్ 26న భారతీయ రైల్వే ఒకే సమయంలో ఐదు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి-ధార్వాడ్, పట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్‌పూర్ రూట్లలో వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.