Loading...
Telangana Government Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారానికి ఐదు రోజుల పనిదినాలపై జేఏసీ ప్రతిపాదన
తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారానికి ఐదు రోజుల పనిదినాలపై జేఏసీ ప్రతిపాదన

Telangana Government Employees: తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. వారానికి ఐదు రోజుల పనిదినాలపై జేఏసీ ప్రతిపాదన

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
04:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఇప్పటికే అమల్లో ఉన్న విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఉమ్మడి జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజును కలిసి వినతిపత్రం అందజేశారు.

వివరాలు

పనివేళల్లో మార్పులు చేయాలని ప్రతిపాదన

ప్రస్తుతం తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నాయి.

ఈ పనివేళలను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మార్చాలని ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదించింది.

ఈ మార్పు అమలైతే రోజుకు ఏడున్నర గంటల పాటు పని చేయాల్సి ఉంటుందని వివరించింది.

రెండో శనివారం సాధారణ సెలవును పరిగణనలోకి తీసుకున్నా వారానికి మొత్తం 37.5 గంటల పని పూర్తవుతుందని పేర్కొంది.

వివరాలు

నీరు, విద్యుత్‌, ఇంధనం ఆదా అవుతాయి

ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో నీరు, విద్యుత్‌, ఇంధన కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జేఏసీ తన వినతిపత్రంలో ప్రస్తావించింది.

వారానికి ఐదు రోజుల పనివిధానం అమలు చేయడం వల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్‌, నీటి వినియోగం తగ్గుతుందని తెలిపింది.

ఉద్యోగుల రాకపోకలు తగ్గడంతో వాహనాల వినియోగం, ఇంధన ఖర్చులు ఆదా అవుతాయని వివరించింది.

అంతేకాకుండా వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుందని వెల్లడి

వారానికి రెండు రోజుల విశ్రాంతి లభించడం వల్ల ఉద్యోగుల్లో పని ఒత్తిడి తగ్గుతుందని జేఏసీ నాయకులు అభిప్రాయపడ్డారు.

దీంతో వారి సామర్థ్యం, పనితీరు మెరుగుపడతాయని తెలిపారు. ఐదు రోజుల పనిదినాల విధానం అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడదని స్పష్టం చేశారు.

ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని జేఏసీ నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరారు.

వీలైనంత త్వరగా వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.

ADVERTISEMENT