Telangana RTC employees : తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆర్టీసీ సిబ్బందికి 2.1 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు చేస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. తాజా పెంపుతో ప్రస్తుతం ఉన్న 50.7 శాతం డీఏ 52.8 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను సప్లిమెంటరీ బిల్లుల ద్వారా చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ డీఏ పెంపు కారణంగా ఆర్టీసీపై నెలకు సుమారు రూ.2.82 కోట్ల అదనపు భారం పడనుందని యాజమాన్యం పేర్కొంది. ఇదివరకు 2025 జులైలో కూడా ప్రభుత్వం 2.1 శాతం డీఏను పెంచిన సంగతి తెలిసిందే.
వివరాలు
ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
2024 మేలో RPS-2017 అమలు చేసినప్పటి నుంచి ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలేవీ పెండింగ్‌లో లేవని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఆర్టీసీ పెండింగ్ పనులపై రీజియనల్ మేనేజర్లతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఆసుపత్రుల అప్‌డేట్, కారుణ్య నియామకాలు, కొత్త బస్సుల కొనుగోలు వంటి చర్యలతో సంస్థను ఆధునీకరిస్తున్నామని మంత్రి వివరించారు. తెలంగాణ ప్రజలకు లైఫ్‌లైన్‌గా ఉన్న ఆర్టీసీ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని ఆయన పిలుపునిచ్చారు.