LOADING...
APSRTC: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆర్టీసీ ప్రయాణం ఇక మరింత సేఫ్!
ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆర్టీసీ ప్రయాణం ఇక మరింత సేఫ్!

APSRTC: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఆర్టీసీ ప్రయాణం ఇక మరింత సేఫ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీఎస్ఆర్టీసీ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు డీజిల్‌పై నడుస్తున్న బస్సులను దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తూ ముందుకు సాగుతోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక ప్రయాణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. 'గ్రీన్ ఇంద్ర ఏసీ' పేరుతో రూపొందించిన ఈ బస్సులు పూర్తిగా ఆధునిక సాంకేతికతతో సిద్ధమయ్యాయి. బయటకు సాధారణ బస్సుల్లా కనిపించినా, లోపల మాత్రం అత్యాధునిక ఫీచర్లతో పనిచేస్తాయి. డీజిల్ బస్సులతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో శబ్దం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు ఇది మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ బస్సుల్లో మెరుగైన ఏసీ సదుపాయం ఉండటంతో ఎండాకాలంలో కూడా చల్లగా ప్రయాణించవచ్చు.

వివరాలు

కాలుష్యానికి చెక్

అదనంగా, ఇవి ఎలక్ట్రిక్ బస్సులు కావడంతో పొగ వంటి కాలుష్యం ఉండదు. దీని వల్ల పర్యావరణానికి హాని తగ్గడంతో పాటు ప్రయాణికుల ఆరోగ్యానికీ మేలు జరుగుతుంది. ఈ బస్సుల్లో హై కెపాసిటీ బ్యాటరీలను అమర్చారు. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించగలిగేలా రూపకల్పన చేశారు. అలాగే హెవీ బ్యాటరీలు త్వరగా ఛార్జ్ అయ్యే విధంగా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. భద్రత పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు, ఎమర్జెన్సీ సదుపాయాలు, ఆటోమేటిక్ మానిటరింగ్ వంటి ఫీచర్లను ఇందులో అందుబాటులో ఉంచారు. ఇప్పటికే ఈ బస్సులను ఇంజనీరింగ్ అధికారులు సమగ్రంగా పరీక్షించారు.

వివరాలు

కొన్ని బస్సులు అందుబాటులో

బ్యాటరీ పనితీరు, బ్రేకింగ్ సిస్టమ్, ఛార్జింగ్ సామర్థ్యం వంటి కీలక అంశాలను సమీక్షించారు. అన్ని పరీక్షల్లో ఈ బస్సులు విజయవంతంగా నిలిచినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్ రన్‌గా కొద్ది బస్సులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యంగా నగరాలతో పాటు దీర్ఘదూర మార్గాల్లో కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నారు. త్వరలోనే ఏపీఎస్ఆర్టీసీ ఎండి బాల సుబ్రమణ్యం ఈ 'గ్రీన్ ఇంద్ర' ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్నారు. కాలుష్యాన్ని తగ్గిస్తూ, ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.

Advertisement