Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. జులై లేదా ఆగస్టులో ఎయిర్‌పోర్ట్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నఅల్లూరి సీతారామ రాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది జులై లేదా ఆగస్టులో విమానాశ్రయాన్ని ప్రారంభించే అవకాశముందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బిసి. జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఆదివారం పర్యటించిన మంత్రి, విమానాశ్రయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. GMR గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్ట్ పురోగతిపై చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పలు కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం విమానాశ్రయ నిర్మాణ పనులు 97 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జులై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో ఒక రోజున ప్రారంభోత్సవం జరగొచ్చని పేర్కొన్నారు.
వివరాలు
విశాఖపట్టణం నుంచి ఏడు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు
ఎర్త్ రన్‌వే పనులు పూర్తిగా (100%) పూర్తయ్యాయని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సంబంధించిన పనులు 95 శాతం పూర్తి అయ్యాయని వివరించారు. విమానాశ్రయానికి అనుసంధానంగా రహదారి అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మరో ఆరు కొత్త విమానాశ్రయాల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని మంత్రి తెలిపారు. అలాగే విశాఖపట్టణం నుంచి ఏడు ప్రధాన రహదారుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, ఆనందపురం కూడలి వద్ద ఎలివేటెడ్ రోడ్‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోందని వెల్లడించారు.
వివరాలు
వైఎస్ జగన్ పై విమర్శలు
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్నోహన్ రెడ్డిపై మంత్రి విమర్శలు గుప్పించారు. గతంలో "ఎర్రబస్సు రాని ప్రాంతానికి ఎయిర్‌బస్ ఎందుకు?" అంటూ వైసీపీ నేతలు విమానాశ్రయంపై ప్రశ్నలు లేవనెత్తారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పుకోవడం తగదని విమర్శించారు. ఈ పర్యటనలో ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి తదితరులు పాల్గొన్నారు.