Andhra Pradesh: తిరుపతి-చెన్నై ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణ రైల్వే పరిధిలో మరో కీలక రైల్వే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పుత్తూరు-అత్తిపట్టు మార్గంలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. చిత్తూరు జిల్లా పుత్తూరు నుంచి నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం, ఊత్తుకోట, సత్యవేడు, గుమ్మిడిపూండి, పొన్నేరి, మీంజూరు మీదుగా అత్తిపట్టు వరకు మొత్తం 88 కిలోమీటర్ల పొడవుతో ఈ రైల్వే లైన్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం తొలి విడతగా రూ.517.47 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. దీంతో సర్వే పనులు, భూసేకరణ ప్రక్రియలు చేపట్టనున్నారు. వాస్తవానికి ఈ రైల్వే మార్గ ప్రతిపాదన 2008-09లోనే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు కేంద్రానికి సమర్పించాయి. మొత్తం రూ.1105 కోట్ల అంచనాతో డీపీఆర్ సిద్ధం చేశారు.
వివరాలు
10 కొత్త రైల్వే లైన్లు, 6 మార్గాల్లో గేజ్ మార్పిడికి గ్రీన్ సిగ్నల్
చెన్నై నుంచి తిరుపతి సహా ఇతర ప్రాంతాలకు ప్రయాణించే వారికి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టును ప్రణాళిక చేశారు. మొదట్లో ఎన్నూర్ పోర్టు, రైల్వే శాఖ కలిసి 50శాతం భాగస్వామ్యంతో ఈ లైన్ నిర్మించాలని భావించినప్పటికీ, 2012లో ఎన్నూర్ పోర్టు తప్పుకోవడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా కేంద్రం మళ్లీ ఊతమిచ్చింది. దక్షిణ రైల్వే పరిధిలో 10కొత్త రైల్వే లైన్లు, 6 మార్గాల్లో గేజ్ మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈక్రమంలో పుత్తూరు-అత్తిపట్టు లైన్‌కు తొలి విడతగా నిధులు కేటాయించింది. ఈకొత్త మార్గంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు మండలాలు, తమిళనాడులోని అత్తిపట్టు వరకు భూమిని గుర్తించి ఇప్పటికే సర్వేలు పూర్తి చేశారు.
వివరాలు
రైతులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులు
త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసి, రైతులకు పరిహారం చెల్లించి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నారాయణవనం, పిచ్చాటూరు, నాగలాపురం ప్రాంతాల్లో రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే తమిళనాడులో ఊతుకోట, పాలవాక్కం, పెరియపాలెం, గంగయాదికుప్పం ప్రాంతాల్లో స్టేషన్లు ప్రతిపాదించారు. ఇదే సమయంలో నగరి నుంచి వేలూరు మీదుగా దిండివనం వరకు మరో రైల్వే ప్రాజెక్టుకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.578.40 కోట్లు మంజూరు చేశారు. దాదాపు 179.2 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గం ఎక్కువగా తమిళనాడులో ఉండనుంది. మొత్తంగా ఈ రెండు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం ఇవ్వడంతో ప్రాంతీయ రవాణా అభివృద్ధికి కీలక ముందడుగు పడినట్లు భావిస్తున్నారు.