Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరొక శుభవార్త తెలిపింది. నాలుగు విడతలుగా రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడం పాటు, తక్కువ ధరకు సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితిలో బహిరంగ మార్కెట్‌లో సిమెంట్ బస్తా ధర రూ.260గా, స్టీల్ టన్ను ధర రూ.54 వేల వరకు ఉంది. ఈ ధరలను తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇసుక ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అలాగే, మొదటి దశలో సొంత స్థలాలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80.54 లక్షల దరఖాస్తులు
ఇక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో సొంత స్థలం కలిగి ఉన్న దరఖాస్తుదారులలో ఎక్కువ మంది పెంకుటిళ్లలో నివసించేవారేనని తేలింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దాదాపు 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం 31.58 లక్షల మంది దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 9.19 లక్షల మంది దరఖాస్తుదారులు సొంత స్థలాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు.