LOADING...
AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు
ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు

AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
01:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టబోయే కొత్త మెడికల్‌ కాలేజీలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించింది. పబ్లిక్‌-ప్రైవేట్‌ భాగస్వామ్యం (PPP) విధానంలో అమలు చేసే ప్రాజెక్టులకు 40 శాతం వరకు ఆర్థిక మద్దతు ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్‌ కాలేజీలు, ఇతర ఆరోగ్య ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని జేపీ నడ్డా తన లేఖలో పేర్కొన్నారు.

Details

25 శాతం వరకు గ్రాంట్‌గా అందిస్తాం

మూలధన వ్యయంలో 30 నుంచి 40 శాతం వరకు గ్రాంట్‌గా, అలాగే నిర్వహణ వ్యయాల్లో 25 శాతం వరకు గ్రాంట్‌గా అందిస్తామని వివరించారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ పథకం కింద పీపీపీ విధానంలో చేపట్టే ఆరోగ్య ప్రాజెక్టులకు ఇప్పటికే కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నట్లు కూడా ఆయన గుర్తు చేశారు. ఈక్రమంలోనే రూ.2 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీని ద్వారా వైద్య సేవలను మరింతగా విస్తరించవచ్చని సూచించారు. రాష్ట్రాల్లో ఆరోగ్య రంగ అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ఈపథకం సమర్థవంతంగా అమలయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు జేపీ నడ్డా తెలిపారు.

Details

పీపీపీ విధానంలో ప్రాజెక్టుల రూపకల్పన

ఇదే తరహాలో రాష్ట్రాలు కూడా పీపీపీ సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో ఈ సెల్‌లు కీలకంగా పనిచేస్తాయని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో పీపీపీ మోడల్‌ను అమలు చేయడం వల్ల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని తన లేఖలో జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయని, ఏపీ కూడా దీనిని స్వీకరించడం హర్షణీయమని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఆరోగ్య రంగంలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష వైసీపీ గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తోంది. ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని ఆరోపిస్తోంది.

Advertisement