Amaravati: గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌సిగ్నల్.. కొత్త మార్గదర్శకాలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్‌లకు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ప్రభుత్వం తెరదించింది. వెబ్‌లాండ్ నమోదుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లలో ఉన్న భూములను ఇకపై రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆ సర్వే నంబరు 22ఎ నిషేధిత జాబితాలో ఉన్నా, లేకపోయినా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగించాలని రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేశారు. వెబ్‌లాండ్ రికార్డుల్లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబర్లకే ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
వివరాలు
గ్రామకంఠం భూములంటే..
గ్రామాల్లో నివాస అవసరాలకు వినియోగించే ప్రాంతాలను సాధారణంగా గ్రామకంఠం భూములుగా పరిగణిస్తారు. ప్రభుత్వ అవసరాలు, సామాజిక అవసరాల కోసం కేటాయించిన భూములను మినహాయించి మిగిలిన గ్రామకంఠం భూములను 2015లోనే 22ఎ నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అయినప్పటికీ అనేక గ్రామకంఠం సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగా నమోదై ఉండటంతో రిజిస్ట్రేషన్‌లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్వే నంబర్ల విభజన జరగకపోవడంతో మొత్తం సర్వే నంబరునే నిషేధిత జాబితాలో చేర్చిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పాత గ్రామాల్లోని ఇళ్ల స్థలాలకు సంబంధించి రెవెన్యూ నమోదుల్లో పూర్తి వివరాలు లేకపోవడం, వారసత్వ ఆస్తులకు సరైన లింకు పత్రాలు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వివరాలు
పన్ను రశీదు చూపిస్తే చాలు
కొత్త మార్గదర్శకాల ప్రకారం..వెబ్‌లాండ్‌లో గ్రామకంఠంగా నమోదైన సర్వే నంబరులో ఆస్తి ఉంటే,అది నిషేధిత జాబితాలో ఉందా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలి. ఆస్తి గ్రామకంఠం సర్వే నంబరులో భాగమేనని చూపించే లింకు పత్రాలు ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అధికారులు అంగీకరించాల్సి ఉంటుంది. లింకు పత్రాలు లేకపోయినా స్థలంలో ఇల్లు ఉంటే, స్థానిక సంస్థలు జారీ చేసిన ఇంటిపన్ను రశీదును ఆధారంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పట్టణప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఖాళీ స్థలాలకు లింకు పత్రాలు,ఇంటిపన్ను రశీదులు లేకపోతే ఖాళీ స్థల పన్ను రశీదును పరిగణనలోకి తీసుకోవాలి. 2023 మార్చి21న విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్న ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
వివరాలు
పన్ను రశీదు చూపిస్తే చాలు
గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వ ఖాళీ స్థలాలకు ఎలాంటి లింకు పత్రాలు, పన్ను రశీదులు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తి స్వయంగా ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. అందులో వారసత్వ వివరాలు, ఆస్తిని స్వేచ్ఛగా అనుభవిస్తున్న అంశం, 22ఎ నిషేధిత జాబితాలో ఆ భూమి లేదనే వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం రెవెన్యూ అధికారుల నుంచి ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని ఒత్తిడి చేయరాదని ప్రభుత్వం ఆదేశించింది. 2026 ఫిబ్రవరి 17న జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేసింది.