Andhra Pradesh: డిగ్రీ, పీజీ కళాశాలలకు ఐదేళ్లు.. ఇంజినీరింగ్ సంస్థలకు 10 ఏళ్ల గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఇంజినీరింగ్,డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ), విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ప్రస్తుతం ఏటా చేపడుతున్న ఈ ప్రక్రియను సరళీకరించి.. అర్హత ఉన్న విద్యా సంస్థలకు ఎక్కువ కాలం అనుమతులు,అనుబంధ గుర్తింపులు ఇచ్చేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం వందల సంఖ్యలో ఉన్న కళాశాలలకు ప్రతి ఏడాది ఈఓపీ,అనుబంధ గుర్తింపు,అనంతరం ప్రభుత్వ అనుమతి వంటి ప్రక్రియలను విడివిడిగా చేపట్టాల్సి వస్తోంది. దీంతో అధికార యంత్రాంగానికి ఎక్కువ సమయం పడటంతోపాటు, కళాశాలల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా విద్యార్థుల ప్రవేశాల కౌన్సెలింగ్ సమయంలో అనుమతులపై స్పష్టత లేక హడావుడి నెలకొంటోంది.
వివరాలు
నిబంధనలు పాటిస్తే మూడేళ్ల వరకు ఈఓపీ
దీనికి పరిష్కారంగా ఈఓపీ,అనుబంధ గుర్తింపుల గడువును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అన్ని నిబంధనలను సక్రమంగా పాటిస్తూ, యూజీసీ 12(బీ) గుర్తింపు కలిగిన విద్యా సంస్థలకు గరిష్ఠంగా మూడేళ్ల వరకు ఈఓపీ మంజూరు చేయనున్నారు.
అయితే భౌతికంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న విద్యా సంస్థలకు మాత్రం ఏడాది కాలానికే ఈఓపీ ఇవ్వనున్నారు.
ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏఐసీటీఈ ప్రతి ఏడాది అనుమతులు జారీ చేస్తున్న నేపథ్యంలో.. ఆ నిబంధనలను కూడా ప్రభుత్వం పరిశీలించనుంది.
వాటికి అనుగుణంగా ఈఓపీ, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విధానంలో అవసరమైన మార్పులు చేయనుంది.
వివరాలు
వర్సిటీల అనుబంధ గుర్తింపు ఇలా..
ఉన్నత విద్య కమిషనరేట్ మంజూరు చేసే ఈఓపీ ఆధారంగా సంబంధిత విశ్వవిద్యాలయాలు కళాశాలలకు అనుబంధ గుర్తింపును జారీ చేస్తాయి.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలల విషయంలో.. భవనం అద్దెకు తీసుకున్న కాలవ్యవధిని కూడా పరిశీలించి ఈఓపీ మంజూరు చేస్తారు.
సొంత భవనం ఉన్న, 30 ఏళ్ల లీజు కలిగిన, ఎలాంటి లోపాలు లేని డిగ్రీ, పీజీ కళాశాలలకు మూడేళ్లపాటు అనుబంధ గుర్తింపు ఇవ్వనున్నారు.
సాంకేతిక విద్యా సంస్థలకు నాలుగేళ్ల వరకు అనుబంధ గుర్తింపు లభించనుంది.
వివరాలు
అర్హతలను బట్టి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు..
న్యాక్, ఎన్‌బీఏ, యూజీసీ 12(బీ) గుర్తింపు కలిగి ఉండటం,50 శాతానికి పైగా సీట్లు భర్తీ కావడం,చివరి ఏడాదిలో కనీసం 75 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవడం, డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.
ఈ అర్హతలు ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలలకు ఐదేళ్లపాటు, ఇంజినీరింగ్ కళాశాలలకు ఆరేళ్ల వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వనున్నారు.
న్యాక్‌లో 'ఏ' గ్రేడ్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు, ఎన్‌బీఏ గుర్తింపు లేదా యూజీసీ స్వయంప్రతిపత్తి హోదా ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలలకు మరింత ఎక్కువ కాలం అనుబంధ గుర్తింపు లభించనుంది.
ఇలాంటి అర్హతలు ఉన్న సంస్థలకు ఏడేళ్ల వరకు, ఇంజినీరింగ్ విద్యా సంస్థలకు గరిష్ఠంగా పదేళ్ల వరకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించారు.
వివరాలు
లోపాలుంటే ఏడాదికే పరిమితం
రుసుముల బకాయిలు పెండింగ్‌లో ఉన్న కళాశాలలు, నిబంధనల్లో లోపాలు ఉన్న విద్యా సంస్థలకు మాత్రం దీర్ఘకాలిక అనుబంధ గుర్తింపు ఇవ్వరు.
అలాంటి సంస్థలకు విశ్వవిద్యాలయాలు ఒక ఏడాది కాలానికే అనుబంధ గుర్తింపును మంజూరు చేయనున్నాయి.
బీఈడీ, న్యాయ కళాశాలలకు మినహాయింపు
బీఈడీ, న్యాయ విద్య కళాశాలలకు మాత్రం కొత్త విధానంలో మినహాయింపు ఇవ్వనున్నారు.
ఈ కళాశాలలకు ఈఓపీతోపాటు విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపును కూడా ప్రతి ఏడాది మాదిరిగానే మంజూరు చేయనున్నారు.