Kaleshwaram Barrages : కాళేశ్వరం రిపేర్ పనులపై సర్కార్ ఫోకస్.. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి, నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఇరిగేషన్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
వివరాలు
స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణ కోసం నీటిపారుదల నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్‌గా స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వీలైనంత త్వరగా పనులను వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టు మరమ్మత్తులకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరమ్మత్తుల పనుల్లో భాగమైన అన్ని ఏజెన్సీలను అప్రమత్తం చేసి, పనుల వేగాన్ని పెంచాలని సూచించారు. కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతున్న పరీక్షలు, నమూనాల సేకరణను వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు
మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో సీపేజీ సమస్యలు తలెత్తడంతో ప్రాజెక్టు భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో NDSA ఇచ్చిన మధ్యంతర నివేదిక, సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం తక్షణ మరమ్మత్తులకు శ్రీకారం చుట్టింది. పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి ఉత్తమ్... "బ్యారేజీల పునరుద్ధరణలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. నిర్ణయించిన గడువులోనే పనులు పూర్తి చేసి బ్యారేజీలను సిద్ధం చేయాలి" అని అధికారులను ఆదేశించారు. ఈ పనులను చేపట్టిన నిర్మాణ సంస్థల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని మంత్రి సూచించారు.
వివరాలు
500 బోరు బావులు తవ్వేందుకు ప్రత్యేక కార్యాచరణ
క్షేత్రస్థాయిలో పనుల పురోగతి, సాంకేతిక నిపుణుల సూచనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. ఏజెన్సీల నుంచి జాప్యం చోటుచేసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా హెచ్చరించారు. కాళేశ్వరం పునరుద్ధరణలో భాగంగా మేడిగడ్డలో కుంగిపోయిన పిల్లర్లతో పాటు మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజీ నిర్మాణాన్ని సమగ్రంగా అధ్యయనం చేయనున్నారు. మేడిగడ్డ పరిసరాల్లో 500 బోరు బావులు తవ్వేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోంది. డిసెంబర్ వరకు చేపట్టాల్సిన పనులపై పూర్తి షెడ్యూల్ రూపొందిస్తున్నారు. అలాగే మేడిగడ్డ వద్ద ప్రత్యేక బేస్ క్యాంపును ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు.