LOADING...
Andhra news: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి.. నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు 
నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు

Andhra news: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి.. నవంబరు ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 27, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పులపై ప్రభుత్వం తుది దశకు చేరింది. ఈ విషయంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు పంపిన అభ్యర్థనలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సీఎం సూచనలు తీసుకున్న తర్వాత ఉపసంఘం తుది నివేదికను సిద్ధం చేయనుంది. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ తరువాత ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించి, గెజిట్‌ ప్రకటన విడుదల చేయనున్నారు. జనగణన దృష్ట్యా ఈ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 31లోపు ముగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

ఉపసంఘానికి దాదాపు 200కు పైగా అభ్యర్థనలు

జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై సమీక్ష చేయడానికి ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని గతంలోనే ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తొలి సమావేశం ఆగస్టు 13న సచివాలయంలో జరిగింది. అనంతరం కలెక్టర్లు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు పంపిన అర్జీలు సేకరించారు. మొత్తంగా దాదాపు 200కు పైగా అభ్యర్థనలు ఉపసంఘానికి అందాయి. ఇటీవల జరిగిన సమావేశంలో వాటిపై విశ్లేషణ చేపట్టి, జిల్లాల అధికారుల అభిప్రాయాలను కూడ రికార్డు చేశారు. ఏజెన్సీ ప్రాంతానికి కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే హామీ సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చారు. ప్రస్తుతం రంపచోడవరం నుంచి పాడేరు జిల్లాకేంద్రానికి సుమారు 187 కి.మీ. దూరం ఉంది.

వివరాలు 

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు 

అందువల్ల రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు మరియు మరో నాలుగు విలీన మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన సిద్ధమైనట్లు సమాచారం. అమరావతిని కేంద్రంగా చేసుకుని పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కొంతభాగంతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే ఆలోచన కూడా పరిశీలనలో ఉంది. సచివాలయం, అసెంబ్లీ భవనాలు పూర్తి దశలో ఉండడంతో పాటు, రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు అమరావతి ప్రధాన వేదికగా మారుతోంది. దీనివల్ల భద్రతా, ప్రోటోకాల్‌ సంబంధిత బాధ్యతలు పెరుగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ కొత్త జిల్లా అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు నివేదికలో వివరించనున్నారు.

వివరాలు 

వైకాపా పాలనలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన అశాస్త్రీయ విభజనలు 

అద్దంకి, మడకశిర సహా పదకొండు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఒక నియోజకవర్గం రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నచో, పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే డివిజన్ పరిధిలోకి తీసుకురావాలనే యోచన ఉంది. ఆదోని మండలంలో సుమారు 1.5 లక్షల జనాభా ఉండటంతో, దానిని విభజించాలనే వినతులు వచ్చాయి. ఈ అంశంపైన కూడా ఉపసంఘం నిర్ణయం తీసుకోనుంది. మండపేట, కొత్తపేట, ఎస్‌.కోట వంటి కొన్ని నియోజకవర్గాలను సమీప జిల్లాలకు మార్చాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వైకాపా పాలనలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన అశాస్త్రీయ విభజనలను సవరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

వివరాలు 

మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు సిఫార్సు

ఎన్నికల సమయంలో చంద్రబాబు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అలాగే అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపాలనే విషయమై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలిపారు. కందుకూరు నియోజకవర్గాన్ని కూడా అదే జిల్లాలో చేర్చే ప్రతిపాదన ఉంది. ఈ ప్రతిపాదనలన్నింటిపై సీఎం వద్ద జరిగే సమావేశంలో చర్చ జరగనుంది. మంత్రివర్గ ఉపసంఘం, మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటుకు సిఫార్సు చేసినట్లు సమాచారం. రామాయపట్నం పోర్టు ఏర్పాటుతో కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి మళ్లించాలా, లేక శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా అనే విషయంపై కూడా సీఎం చర్చించనున్నారు.