CRDA Limits: సిఆర్‌డిఏ పరిధి పెంపు.. క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ
ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధి ఇటీవల పరిధిని కుదించడంతో, తాజాగా ప్రభుత్వం ఈ మార్పులను పూర్వపు స్థితికి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట సీఆర్డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటైన సమయంలో, విజయవాడ-గుంటూరు నగరాలను కేంద్రంగా చేసుకుని భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 8,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీని పరిధిని నిర్ణయించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, సీఆర్డీఏ విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి, పల్నాడు, బాపట్ల పట్టణాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. అయితే తాజాగా రాష్ట్ర మునిసిపల్ శాఖ పూర్వపు సీఆర్డీఏ పరిమితిని పునరుద్ధరించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది.
1,069.55 చదరపు కిలోమీటర్ల పరిధిని సీఆర్డీఏ పరిధిలో..
పల్నాడు జిల్లా సత్తెనపల్లి పురపాలక సంఘంతో పాటు అక్కడి 92 గ్రామాలు కలిపి 1,069.55 చదరపు కిలోమీటర్ల పరిధిని సీఆర్డీఏ పరిధిలో చేర్చారు. అలాగే, బాపట్ల పరిధిలోని 562.41 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో మొత్తం 1,631.96 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని చేరుస్తూ ముఖ్యకార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా సీఆర్డీఏ పరిధి పూర్వపు స్థాయికి పెరిగింది. ఈ మార్పులతో గుంటూరు జిల్లాలోని బాపట్ల, పల్నాడు ప్రాంతాలను సీఆర్డీఏ పరిధిలో తిరిగి చేర్చారు. మొత్తం సీఆర్డీఏ పరిధి ప్రస్తుతం 6,983.24 చదరపు కిలోమీటర్ల నుండి 8,352.69 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది.