
Telangana: మహిళా డ్రైవర్లకు ఆర్టీసీలో అవకాశాల వెల్లువ.. అవకాశాలను వినియోగించుకోకుండా వెనకడుగు
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టీసీలో శాశ్వత నియామకాలతో మహిళలకు వేల సంఖ్యలో డ్రైవర్ పోస్టులు కేటాయించినా, అనేక కారణాల వల్ల మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకోకుండా వెనకడుగేయడం గమనించదగిన విషయం. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొస్తోంది. ఆర్టీసీ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలులో ఉంది.దీనివల్ల కండక్టర్లు సహా ఇతర విభాగాల్లో గణనీయమైన సంఖ్యలో మహిళలు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నారు. హైదరాబాద్,సికింద్రాబాద్,రంగారెడ్డి ప్రాంతాల్లో ఆర్‌ఎంలుగా మహిళలు సేవలందిస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా 15వేలకుపైగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ పోస్టుల్లో 33శాతం రిజర్వేషన్ ప్రకారం కనీసం 5 వేల మహిళా డ్రైవర్లు ఉండాల్సి ఉంది.
వివరాలు
హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ
అయితే,డ్రైవింగ్ అనుభవం లేకపోవడం,ఇతర అనేక కారణాల వల్ల మహిళలు ఈ పోస్టులకు ముందుకు రావడంలో ఆసక్తి చూపడం లేదు. దీంతో ఈ పోస్టులు ప్రధానంగా పురుషులకే పరిమితమవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు మహిళలకు హెవీ వెహికిల్ డ్రైవింగ్‌లో శిక్షణను ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్),'మెవో' అనే స్వచ్ఛంద సంస్థతో ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు హకీంపేట, సిరిసిల్లలో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరించనుంది.
వివరాలు
విద్యార్హతలు కలిగిన మహిళలకు ఆర్టీసీ డ్రైవర్లు
శిక్షణ పూర్తయిన తర్వాత అవసరమైన విద్యార్హతలు కలిగిన మహిళలను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించనున్నారు. తగిన అర్హతలు లేని ఇతరులకూ ఐటీ సంస్థల ప్రాంగణాల్లో బస్సు డ్రైవర్లుగా అవకాశాలు కల్పించనున్నారు. మహిళలు డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తే, బస్సుల్లో ప్రయాణికులకు భద్రతా వాతావరణం మెరుగవుతుందన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.