Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్ సిగ్నల్.. 707 కొత్త సెల్ టవర్ల ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్ సరిగ్గా లేదు..! ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ప్రపంచం మొత్తం 5జీ టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తుంటే, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ పూర్తిస్థాయి సెల్‌ఫోన్ సేవలు అందుబాటులోకి రాలేదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మారుమూల,ఏజెన్సీ ప్రాంతాల్లో సంతృప్తికర స్థాయిలో మొబైల్ నెట్‌వర్క్ అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 707 సెల్ టవర్ల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. 'డిజిటల్ భారత్ నిధి' పథకం కింద ఈ టవర్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.
వివరాలు
సిగ్నల్ అంతరాయం ఎదురవుతున్న ప్రాంతాల్లో కొత్త టవర్ల ఏర్పాటు
ఈ పనుల్లో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో పాటు జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రైవేటు కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. మారుమూల ప్రాంతాల్లో ప్రస్తుతం సరైన సిగ్నల్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెల్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ఇప్పటికే ఉన్న టవర్ల సామర్థ్యం చాలడం లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తరచూ సిగ్నల్ అంతరాయం ఎదురవుతున్న ప్రాంతాల్లో కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెవెన్యూ భూములతో పాటు అటవీ ప్రాంతాల్లోని భూములు కూడా అవసరం అవుతున్నాయి. కొన్ని గ్రామాలకు టవర్ల సామగ్రి తరలించేందుకు సరైన రహదారి మార్గం లేకపోవడం మరో సవాలుగా మారింది.
వివరాలు
ఒక్క జిల్లాలోనే 100 టవర్ల ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం
ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని అనేక గిరిజన గ్రామాల్లో సెల్‌ఫోన్ నెట్‌వర్క్ సమస్య తీవ్రమైన స్థాయిలో ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే 100 టవర్ల ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 42 ప్రాంతాల్లో సంయుక్త సర్వే పూర్తికాగా, మరో 13 లొకేషన్లను టవర్ల నిర్మాణానికి సంబంధిత సంస్థలకు ఇప్పటికే అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా సిగ్నల్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించింది.
వివరాలు
రాష్ట్రవ్యాప్తంగా 624 కొత్త సెల్ టవర్ల ప్రతిపాదన
నెట్‌వర్క్ వినియోగం పెరిగిన కారణంగా అక్కడి టవర్ల సామర్థ్యం సరిపోకపోవడం స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో అదనపు టవర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ లక్ష్యంతో '4జీ సంతృప్తత' విధానంలో రాష్ట్రవ్యాప్తంగా 624 కొత్త సెల్ టవర్ల ప్రతిపాదనను రూపొందించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన వీటి కోసం అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించారు. ఇప్పటివరకు 295 ప్రాంతాల్లో సంయుక్త సర్వే పూర్తవగా, 37 లొకేషన్లను టవర్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత సంస్థలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.