Andhrapradesh: ప్రభుత్వ గుర్తింపు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. ఇందులో తర్ఫీదు పొందితే పరీక్ష ఉండదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటి వరకూ చాలామంది సరైన శిక్షణ లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. పట్టణాలు, నగరాల్లో కొన్ని డ్రైవింగ్ స్కూళ్లు ఉన్నా,వాటిలో ట్రాక్‌లు,ప్రాథమిక వసతులు పూర్తిగా లేవు. దీంతో కేవలం పేరుకే శిక్షణ ఇచ్చే పరిస్థితి ఉంది.ఈ నేపథ్యంలో,డ్రైవింగ్ నేర్చుకునే వారికి నిబంధనలు,భద్రతా పద్ధతులు స్పష్టంగా నేర్పే విధంగా కొత్త శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించారు. మన రాష్ట్రంలో ప్రతి పదిలక్షల మందికి ఒకటి చొప్పున మొత్తం 53 డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లు (DTCs) మంజూరు చేశారు. అదనంగా,5 ప్రాంతీయ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు(RDTCs)ను కూడా కేంద్ర రవాణా & జాతీయ రహదారుల శాఖ (MoRTH) ఆమోదించింది.
వివరాలు
ఆర్‌డీటీసీ (Regional Driving Training Centre) ముఖ్యాంశాలు
రాష్ట్రంలో మొత్తంగా 5 ఆర్‌డీటీసీలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాంధ్ర - 1, కోస్తాంధ్ర - 3, రాయలసీమ - 1. ప్రతి ఆర్‌డీటీసీ కోసం కనీసం 3 ఎకరాల భూమి అవసరం. ఈ కేంద్రాలకు రూ.5 కోట్ల వరకూ కేంద్రం నిధులు అందిస్తుంది. ఇక్కడ శిక్షణ పూర్తి చేసిన వారికి డ్రైవింగ్ టెస్ట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ కేంద్రం నుంచే లైసెన్స్ కోసం దరఖాస్తు & మంజూరు చర్యలు పూర్తవుతాయి. డీటీసీ (Driving Training Centre) ముఖ్యాంశాలు : డీటీసీ ఏర్పాటు కోసం కనీసం 2 ఎకరాల స్థలం ఉండాలి. ఒక్కో కేంద్రం కోసం అయ్యే వ్యయంలో 85%వరకు, గరిష్ఠంగా రూ.2.5 కోట్లు మోర్త్ అందిస్తుంది.
వివరాలు
డీటీసీ (Driving Training Centre) ముఖ్యాంశాలు :
ఇక్కడ బైక్‌లు, కార్లు, భారీ వాహనాలు (లారీ, బస్సులు) నడిపేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. ప్రాథమిక జాగ్రత్తలు, ట్రాఫిక్ నియమాలు క్లాస్‌రూమ్ తరగతుల ద్వారా, తరువాత సిమ్యులేటర్‌పై, ఆపై ట్రాక్‌పై శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక, లైసెన్స్ కోసం రవాణాశాఖ వద్ద డ్రైవింగ్ పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదు. నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. శిక్షణ వ్యవధి, ఫీజులు తదితర విషయాలను మోర్త్ నిర్ణయిస్తుంది. దరఖాస్తుల ప్రక్రియ 53 డీటీసీలు, 5 ఆర్‌డీటీసీల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేయాలి. అర్హతలు, భూమి అందుబాటు పరిశీలించిన తర్వాత కలెక్టర్ రవాణా కమిషనర్‌కు సిఫార్సు చేస్తారు.
వివరాలు
గడువు వివరాలు
ఇప్పటికే: ఎన్టీఆర్, శ్రీకాకుళం, నెల్లూరు - ఒక్కో జిల్లాలో 2 చొప్పున అనంతపురం, కృష్ణా, తిరుపతి, పశ్చిమగోదావరి, బాపట్ల, కాకినాడ - ఒక్కో జిల్లా నుంచి 1 దరఖాస్తు వచ్చింది. వీటిలో అనంతపురం జిల్లా దరఖాస్తు ఇప్పటికే ఆమోదం పొందింది. అయితే ఆర్‌డీటీసీలకు ఇప్పటివరకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. జనవరి చివరి వరకు దరఖాస్తులు చేయవచ్చు. ఫిబ్రవరి చివరి నాటికి మోర్త్ వద్దకు ప్రతిపాదనలు పంపాలి. వచ్చే ఏడాదిలో ఈ శిక్షణ కేంద్రాలు సర్వసాధారణ ప్రజలకు అందుబాటులోకి రావడానికి చర్యలు కొనసాగుతున్నాయి.