Centre: ఒక అధికారికి ఇకపై ఒకే కారు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలు
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ అధికారుల అధికారిక వాహనాల వినియోగంలో కీలక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై 'ఒక అధికారి-ఒక అధికారిక కారు (One Officer-One Official Car)'విధానాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ శాఖ (Department of Expenditure) మంగళవారం స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఒక అధికారికి ఒక శాఖ బాధ్యతలు మాత్రమే ఉంటే ఒక అధికారిక కారు కేటాయించేవారు. అయితే అదే అధికారికి అదనంగా మరో శాఖ లేదా విభాగం బాధ్యతలు అప్పగించినప్పుడు,ఆయా శాఖల నుంచి వేర్వేరుగా అధికారిక వాహనాలను వినియోగించే అవకాశం ఉండేది. దీంతో కొందరు అధికారులు ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ కార్లను ఉపయోగించే పరిస్థితి నెలకొంది.
వివరాలు
ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకే ఈ నిర్ణయం
కొత్త నిబంధనల ప్రకారం ఇకపై అలాంటి వెసులుబాటు ఉండదు. ఒక అధికారికి ఎన్ని మంత్రిత్వ శాఖలు లేదా విభాగాల బాధ్యతలు ఉన్నా, ముందుగా కేటాయించిన ఒక్క అధికారిక కారునే వినియోగించాలి.
అదనపు శాఖలు కేటాయించారనే కారణంతో మరో ప్రభుత్వ వాహనాన్ని తీసుకునే అవకాశం ఉండదు.
కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ వాహనాల వినియోగాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకుంది.
అధికారిక వాహనాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఒకే అధికారి కోసం అనవసరంగా పలువురు వాహనాలను వినియోగించకుండా చూడడం, ప్రభుత్వ రవాణా వ్యయాన్ని తగ్గించడం, ప్రజాధనాన్ని ఆదా చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంది.
వివరాలు
ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిబంధనలు
అలాగే, వేర్వేరు మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలను ఒకే అధికారి పర్యవేక్షిస్తున్నప్పటికీ, వారికి ఒకే అధికారిక వాహనం మాత్రమే కేటాయించాల్సి ఉంటుందని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన తర్వాత మిగిలిపోయే ప్రభుత్వ వాహనాలను ప్రభుత్వ స్వాధీనంలోనే ఉంచాలని,వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనధికారికంగా వినియోగించరాదని ఆదేశించింది.
ప్రభుత్వ వనరులను సమర్థంగా వినియోగించడం,వాహనాల దుర్వినియోగాన్ని నివారించడం,రవాణా నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా ఈ నిబంధనలను అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక వాహనాల వినియోగానికి సంబంధించి 2022 సెప్టెంబరులో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుబంధంగా ఈ తాజా మార్గదర్శకాలను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.