Telangana: ఒక్క 'హాయ్'తో ప్రభుత్వ సేవలు మీ చేతిలోనే.. తెలంగాణలో కొత్త ప్రయోగం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, అన్ని సేవలను నేరుగా మొబైల్‌లో అందించేందుకు వాట్సాప్ ఆధారిత చాట్‌బాట్ వ్యవస్థను ప్రారంభించింది. ఇందుకోసం 80969 58096 అనే ప్రత్యేక వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నంబర్‌ను 'వన్ స్టాప్ షాప్'లా రూపకల్పన చేసి, ప్రభుత్వ సేవలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చారు. ఈ నంబర్‌కు'Hi'అని మెసేజ్ పంపగానే, వివిధ సేవలతో కూడిన మెనూ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం మీ-సేవ పోర్టల్‌లో లభించే కులం, ఆదాయం వంటి ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడం, మున్సిపల్ పన్నులు చెల్లించడం వంటి సేవలు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
విజయవంతంగా ప్రయోగించిన ప్రభుత్వం
అదనంగా రెవెన్యూ, విద్యుత్, పౌర సరఫరాల శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా పొందవచ్చు. ఇటీవల ఇంటర్, పదో తరగతి, ఇతర ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించి ప్రభుత్వం విజయవంతంగా ప్రయోగం చేసింది. గతంలో వేర్వేరు శాఖలకు వేర్వేరు వెబ్‌సైట్లు ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని సేవలను ఒకే ప్లాట్‌ఫామ్‌లో సమీకరించే ఈ ఇంటిగ్రేటెడ్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఫిర్యాదుల నమోదు నుంచి సర్టిఫికెట్ల జారీ వరకు అన్నీ ఒకే వేదికలో నిర్వహించడం ద్వారా పాలనలో పారదర్శకత, వేగం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వివరాలు
పెన్షన్ల సమాచారాన్ని తెలుసుకొనే అవకాశం
మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు, అర్హత వివరాలు తెలుసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల సమాచారాన్ని కూడా ఇందులో అనుసంధానించనున్నారు. అంతేకాక లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యే నగదు వివరాలను వాట్సాప్ మెసేజ్ రూపంలో అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇదే వేదిక ద్వారా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇకపై ప్రభుత్వ అధికారిక సందేశాలు, అలర్ట్‌లు కూడా ఈ నంబర్ ద్వారానే ప్రజలకు చేరనున్నాయి.