గవర్నర్ ఆర్ఎన్ రవి: ఒకవైపు తమిళనాడు ప్రభుత్వంతో వివాదం; మరోవైపు ప్రధాని మోదీపై ప్రశంసలు
వి.సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య ఉప్పు, నిప్పుగా మారింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్ రవి ప్రశంసలు కురిపించారు. ఒక బహిరంగ సభలో శనివారం గవర్నర్ మాట్లాడుతూ, భారత సారాంశాన్ని మోదీ అర్థం చేసుకున్నారని అన్నారు. సనాతన ధర్మాన్ని మోదీ ప్రపంచానికి చాటారన్నారు. బలం స్నేహితులను ఆకర్షిస్తుందని, బలహీనత శత్రువులను ఆహ్వానిస్తుందని శుక్రాచార్య రాసిన 'శుక్రనీతి'లోని సంస్కృత శ్లోకాన్ని ఈ సందర్భంగా గవర్నర్ ఉటంకించారు. 'అమృత్ కాల్' అనే సూత్రాన్ని మోదీ సృష్టించారన్నారు. రాబోయే 25 సంవత్సరాల్లో ఈ దేశం సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆకాంక్షించారు.
గవర్న్‌కు స్టాలిన్ లేఖ, బాలాజీని మంత్రిగా కొనసాగిస్తానని ప్రకటన
వి.సెంథిల్ బాలాజీని మంత్రిగా తొలగించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి శుక్రవారం గవర్నర్ ఆర్ ఎన్ రవికి లేఖ రాశారు. తన మంత్రులను తొలగించే అధికారాలు గవర్నర్‌కు లేవని ఆ లేఖలో పునరుద్ఘాటించారు. ఆ అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. తన సలహా లేకుండా తమ సహచరుడిని తొలగించిన మీ రాజ్యాంగ విరుద్ధ ప్రక్రియ చెల్లదని ఎంకే స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. దోషిగా తేలిన తర్వాతే బాలాజీ అనర్హుడవుతాడని స్టాలిన్ చెప్పారు. బాలాజీని బర్తరఫ్ చేసినా మంత్రిగా కొనసాగిస్తానని స్టాలిన్ స్పష్టం చేశారు.
గవర్నర్ అధికారాలపై రాజకీయ వర్గాల్లో చర్చ
ఉద్యోగాల నగదు కుంభకోణం కేసులో సెంథిల్ బాలాజీని జూన్ 14న ఈడీ అరెస్టు చేసింది. జూన్ 13న చెన్నై, కరూర్, ఈరోడ్‌లోని బాలాజీ నివాసాలు, ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. దాదాపు 18గంటలపాటు ప్రశ్నించిన ఈడీ జూన్ 14న మనీలాండరింగ్ ఆరోపణలపై బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టు అనంతరం బాలాజీ పోర్ట్‌ఫోలియోలను తొలగించిన సీఎం స్టాలిన్, అతన్ని మంత్రిగా కొనసాగించారు. ఈ క్రమంలో మంత్రి సెంథిల్ బాలాజీపై నేరారోపణలు ఉన్నందున తమిళనాడు గవర్నర్ గురువారం ఆయనను భర్తరఫ్ చేసారు. ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంంగా మారింది. ఈ వ్యవహారంతో గవర్నర్ అధికారాలు మరోసారి చర్చకు వచ్చాయి.