Telangana: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజున గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సభను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను మరింత శక్తివంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ప్రపంచానికి దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ ఎదుగుతోందని పేర్కొన్నారు. కోర్, ప్యూర్, రేర్ అనే విధానంతో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను విభజించినట్లు వెల్లడించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.
వివరాలు
మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని చెప్పారు. ఏడాది వ్యవధిలోనే సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికీ చేరేలా చర్యలు తీసుకున్నామని గవర్నర్ వివరించారు. మూసీ నది ప్రక్షాళనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గవర్నర్ తెలిపారు. మొత్తం 55కిలోమీటర్ల మేర మూసీ నదిని పునరుజ్జీవింపజేయనున్నట్లు చెప్పారు. మొదటి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. మూసీ నదిలో మురుగునీరు చేరకుండా అడ్డుకునేందుకు 39ఎస్టీపీలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఓఆర్‌ఆర్ తరహాలో రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్ఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులు అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వివరాలు
మూసీ పునరుజ్జీవనానికి శ్రీకారం
ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్‌లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామని వివరించారు. వరంగల్, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాలు రానున్నాయని తెలిపారు. భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సేవలకు శంషాబాద్ కీలక కేంద్రంగా మారుతుందని చెప్పారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించినట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నాలుగు కమిషనరేట్లుగా విభజించినట్లు వెల్లడించారు.
వివరాలు
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
హైడ్రా చర్యల ద్వారా 1045 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా తెలిపారు. దాదాపు రూ.60వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడినట్లు చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పాలసీతో పాటు టూరిజం,క్రీడల విధానాలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 22జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణం కొనసాగుతోందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో 494బస్సులు నడుస్తున్నాయని వివరించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష వరకు రుణాలు మంజూరు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ స్పష్టం చేశారు.