
Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
అంతేకాదు, గతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారత్‌లో చేసిన దాడుల దృశ్యాలను కూడా బహిర్గతం చేయాలని యోచనలో ఉంది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాద కార్యకలాపాలను ప్రపంచానికి స్పష్టంగా చూపించాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఏప్రిల్ 22న పహల్గాం ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో పర్యాటకులపై ఉగ్రవాదులు అత్యంత క్రూరంగా దాడికి పాల్పడగా, దాంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటన తర్వాత భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వివరాలు
మోదీ నివాసంలో అత్యంత కీలక భేటీ
దీనికి సంబంధించి భారత్ కీలక దౌత్య చర్యలు తీసుకుంది. మొదటిగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, వెంటనే పాక్ పౌరులను దేశం విడిచిపెట్టాలని ఆదేశించింది.
ఈ చర్యలతో పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సిమ్లా ఒప్పందం సహా ఇతర ద్వైపాక్షిక ఒప్పందాలన్నింటినీ పక్కనబెడుతున్నట్లు ప్రకటించింది.
ఇక నిన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన అత్యంత కీలక భేటీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,త్రిదళాధిపతి అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్,ఆర్మీ,నేవీ,వైమానిక దళాల అధిపతులు సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వివరాలు
భారత సాయుధ దళాల నైపుణ్యం,సామర్థ్యం నమ్మకం
సుమారు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో దేశ అంతర్గత భద్రత పరిస్థితులు, సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న పరిణామాలపై విశ్లేషణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ - పహల్గాం దాడికి బాధ్యులైన వారిని తగిన శిక్షకు గురిచేయాలన్నదే దేశ ప్రజల సంకల్పమని స్పష్టం చేశారు.
భారత సాయుధ దళాల నైపుణ్యం,సామర్థ్యం మీద తనకు పూర్తి నమ్మకముందని ఆయన పేర్కొన్నారు.