LOADING...
Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై చర్చించేందుకు మంత్రి శుక్రవారం విజయవాడలో రాష్ట్ర రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆయన ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వ లక్ష్యాన్ని అందించేందుకు మిల్లర్ల సహకారం అవసరమని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంక్‌ గ్యారంటీలను 1:2 నిష్పత్తిలో ఏర్పాటు చేస్తామని, దీనికి 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని మంత్రి వివరించారు.

Details

అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు సహకరించాలి

రైతులు ధాన్యం విక్రయించిన 24-48 గంటల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రూ.1,674 కోట్ల బకాయిలు, మిల్లర్లకు చెల్లించాల్సిన రూ.763 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించినట్లు మంత్రి గుర్తుచేశారు. మిల్లర్లకు రైతుల కోసం కలిసి పనిచేయాలని, అలాగే పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావు, కోశాధికారి రంగయ్యనాయుడు, 26 జిల్లాల రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement