Amaravati: త్రివర్ణ శోభతో అమరావతి.. గణతంత్ర వేడుకలకు ముస్తాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగసుందరంగా సిద్ధమైంది. రాయపూడి సమీపంలోని సీడ్ యాక్సెస్ రహదారి పక్కన ఉన్న ఎమ్మెల్యే నివాసాల సముదాయాల నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. అమరావతిలో తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేదికకు వెళ్లే అన్ని దారులు త్రివర్ణ పతాకాలతో అలంకరించబడి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. మువ్వన్నెల వెలుగులతో ప్రేక్షకుల గ్యాలరీలను సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ దళాల కవాతుకు అనువుగా పరేడ్ ప్రాంగణాన్ని సిద్ధం చేయడంతో పాటు,శకటాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా రహదారిని నిర్మించారు.
వివరాలు
అమరావతి రైతులకు ప్రత్యేక గౌరవం
వీవీఐపీ, వీఐపీ వాహనాల పార్కింగ్‌కు 15 ఎకరాలు కేటాయించగా, సాధారణ ప్రజలు,రైతుల కోసం మరో 25 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వాన పత్రాలు పంపింది. వారి కోసం వేడుకల ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర మంత్రులు తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. మొత్తం సుమారు 13 వేల మంది పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వివరాలు
22 శకటాలు సిద్ధం
వేదిక పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ,స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు,గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 22 శకటాలను సిద్ధం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వీటిని ప్రదర్శించనున్నారు.'వందేమాతరం' గీతం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఇతివృత్తంతో సాంస్కృతిక శాఖ రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే'పేదరికం లేని సమాజం'(జీరో పావర్టీ మిషన్) లక్ష్యంగా ప్రణాళిక,వైద్య-ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, విద్య, మహిళా-శిశు సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి తదితర శాఖల శకటాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చనున్నాయి.