Telangana: నాలా అనుమతులు లేకున్నా ఇళ్ల రిజిస్ట్రేషన్లకు గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా తీసుకోవాల్సిన నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాలా రుసుం చెల్లించకుండా వ్యవసాయ భూముల్లో నిర్మించిన ఇళ్లకు ఇన్నాళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అలాంటి భూములను నిషేధిత జాబితా (22ఏ)లో ఉంచడంతో క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా పోయింది. '22ఏ'లో ఉన్న భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నాలా సమస్య పరిష్కారానికి శనివారం మెమో నంబర్ 48062ను జారీ చేసింది.
వివరాలు
సాగు భూముల్లో నిర్మాణాలు.. రికార్డుల్లో మాత్రం వ్యవసాయ భూములే
'కోర్టు కేసులు, న్యాయ వివాదాలు ఉన్న భూములను మినహాయించి.. నాలా అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో అర్హమైన వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ మెమోలో పేర్కొన్నారు.
దీంతో ఇన్నాళ్లుగా నాలా అనుమతుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భూ యజమానులకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.
పట్టణ ప్రాంతాలు విస్తరిస్తున్న కొద్దీ వ్యవసాయ భూములు క్రమంగా ఆవాస ప్రాంతాలుగా మారాయి. క్షేత్రస్థాయిలో ఇళ్ల నిర్మాణాలు, ఇతర నిర్మాణాలు ఏర్పడినప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం ఆయా భూములు ఇప్పటికీ వ్యవసాయ భూములుగానే కొనసాగుతున్నాయి.
వాస్తవంగా వ్యవసాయ భూమిలో నివాస నిర్మాణం చేపట్టాలంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్ (నాలా) చట్టం ప్రకారం ఫీజు చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది.
వివరాలు
3శాతం ఫీజు చెల్లిస్తే అనుమతులు పొందే అవకాశం
జీహెచ్‌ఎంసీ పరిధిలో భూమి మూల విలువపై 2 శాతం, ఇతర ప్రాంతాల్లో 3 శాతం ఫీజు చెల్లిస్తే నాలా అనుమతులు పొందే అవకాశం ఉంది.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా నాలా అనుమతి తీసుకోకుండానే సిద్ధం చేసిన వేలాది లేఅవుట్లు, వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
అలాగే 'ఫాం ల్యాండ్స్' పేరుతో వ్యవసాయ భూములను కొనుగోలు చేసి వాటిలో నిర్మాణాలు చేపట్టినవారూ ఉన్నారు.
నాలా అనుమతులు లేకపోవడంతో ఈ భూములు, నిర్మాణాలు 22ఏ నిషేధిత జాబితాలో చేరాయి. ఫలితంగా వాటి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
వివరాలు
సర్వే చేసి సాగేతర భూమిని గుర్తించాల్సిందే
ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ తరహా సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఏర్పడింది.
రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వ్యవసాయ భూముల్లో నివాసాలు, ఇతర నిర్మాణాలు ఏర్పడినా.. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం అవి సాగు భూములుగానే కొనసాగుతున్నాయి.
ఒకే సర్వే నంబరులో కొంత భూమిలో ఇల్లు లేదా ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేసుకుని.. మిగిలిన భూమిని వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు వినియోగిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు.
ఇలాంటి సందర్భాల్లో వాస్తవ పరిస్థితులను గుర్తించేందుకు ఆయా ప్రాంతాల్లో సర్వే నిర్వహించాల్సి ఉంటుంది. సర్వే అనంతరం సర్వే నంబరుకు ఉప సంఖ్య ఏర్పాటు చేసి.. ఆ సర్వే నంబరులోని సాగేతర భూమిని వ్యవసాయ భూమి నుంచి తొలగించాల్సి ఉంటుంది.
వివరాలు
రైతుభరోసా నిధులపైనా ప్రభావం
అయితే ఇన్నేళ్లుగా పలువురు భూ యజమానులు సర్వే చేయించేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాత రెవెన్యూ రికార్డులే కొనసాగుతూ వచ్చాయి.
ప్రభుత్వం వ్యవసాయ భూములకు రైతుభరోసా నిధులు అందిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సాగేతర భూములకు కూడా వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో కొనసాగుతున్న కారణంగా వేల ఎకరాలకు రైతుభరోసా నిధులు విడుదలవుతున్నాయి.
దీంతో ఏటా కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగమవుతూ వస్తోందని అధికారులు భావిస్తున్నారు.
ఇక నాలా అనుమతులు పొందేందుకు, ఆ తర్వాత రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు మార్గం సుగమం కానుండటంతో.. భూముల వాస్తవ వినియోగాన్ని రెవెన్యూ రికార్డుల్లో సరిచేసే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
తద్వారా ఇకపై రైతుభరోసా నిధులు సాగేతర భూములకు పక్కదారి పట్టకుండా ఉంటాయని పేర్కొంటున్నారు.
వివరాలు
ఆస్తుల విలువ పెరుగుతుంది: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో నాలా అనుమతులు లేని ఆస్తులు వేల సంఖ్యలో ఉన్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇలాంటి నివాసాల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తున్నట్లు శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
నాలా అనుమతులు లేకపోవడం వల్ల ఏళ్లుగా సొంత ప్లాట్లను విక్రయించుకోలేక, వాటిపై రుణాలు పొందలేక వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు.
నాలా అనుమతులు లభిస్తే ఆయా ఆస్తులకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతుందని, తద్వారా వాటి విలువ కూడా పెరుగుతుందని తెలిపారు.
అలాంటి భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
వివరాలు
24 గంటల్లోనే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
భూ యజమానులు దరఖాస్తు చేసుకుంటే జిల్లా కలెక్టర్లు వాటిని పరిశీలించి.. అర్హత ఉన్న దరఖాస్తులను పారదర్శకంగా, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరిస్తారని తెలిపారు.
గత నెల 16న శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 22ఏతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పొంగులేటి తెలిపారు.
సీఎం హామీ ఇచ్చిన 24 గంటల్లోనే ఈ సమస్యల పరిష్కారం కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
అలాగే జీవోలు 118, 76లకు అనుగుణంగా క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మెమోలు జారీ చేసినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
తాజా మెమోతో కోర్టు కేసులు, న్యాయ వివాదాలు లేని అర్హమైన దరఖాస్తులను పరిశీలించి నాలా అనుమతుల సమస్యను పరిష్కరించేందుకు మార్గం సుగమమైంది.