Page Loader
Vande Bharat: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే ఆమోదం!
వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే ఆమోదం!

Vande Bharat: వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లకు గ్రీన్‌సిగ్నల్‌.. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌కు రైల్వే ఆమోదం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాత్రివేళ దూర ప్రయాణాలకు వినియోగించే ప్రస్తుత రైళ్ల స్థానంలో వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న వందే భారత్‌ సెమీ హైస్పీడ్‌ రైళ్లను మరింత అధునాతన సాంకేతికతతో, అధిక సౌకర్యాలతో రూపొందించాలన్న యోజనతో స్లీపర్‌ వేరియంట్ల తయారీకి దారితీసింది. ఈ స్లీపర్‌ వందే భారత్‌ రైళ్ల కోసం రూ.55 వేల కోట్ల విలువైన టెండర్లను రైల్వే శాఖ ఖరారు చేసింది. మొత్తం 1,920 కొత్త కోచ్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టును మూడు సంస్థలకు అప్పగించారు. అవే బీఈఎంఎల్‌,కినెట్‌ రైల్వే సొల్యూషన్స్‌, టిట్లాగఢ్‌ రైల్వే సిస్టమ్స్‌ లిమిటెడ్‌-భారత్‌ హెవీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌. ఈ కన్సార్టియం ద్వారా అత్యాధునిక స్లీపర్‌ కోచ్‌లు రూపొందించబడతాయి.

Details

 2027 నుంచి వందే స్లీపర్‌ కోచ్‌లు

ఈ సంస్థలు నిర్మించే స్లీపర్‌ బోగీలను 2027 నుంచి దశలవారీగా ట్రాక్‌పైకి తీసుకురానున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని లాతూర్‌లో కినెట్‌ సంస్థ వందే భారత్‌ స్లీపర్‌ కోచ్‌లను నిర్మించడం ప్రారంభించింది. త్వరలోనే ప్రొటోటైప్‌ నమూనాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. మొత్తం 1,920 కోచ్‌లు 2029 నాటికి పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించనున్నాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఛెయిర్‌ కార్‌ రైళ్ల ఉత్పత్తికి చివరిదశ ఇంకొన్ని వందే భారత్‌ ఛెయిర్‌ కార్‌ రైళ్లను తయారు చేయడం కూడా ముందుగానే ప్లాన్‌లో ఉంది. ఇందుకోసం మరో 11 ఛెయిర్‌ కార్‌ రైళ్లను ఉత్పత్తి చేయనున్నట్లు ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ అధికారి తెలిపారు. దీనితర్వాత ఇక ఛెయిర్‌ కార్‌ల ఉత్పత్తిని నిలిపేసి పూర్తిగా స్లీపర్‌ కోచ్‌లపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

Details

నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి 

బెంగళూరులోని బీఈఎంఎల్‌, చెన్నై పెరంబూరులోని ఐసీఎఫ్‌ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే వందే భారత్‌ స్లీపర్‌ బోగీల నిర్మాణం ప్రారంభమైంది. గతేడాది ఆగస్టులో ప్రొటోటైప్‌ తయారీ పూర్తయిందనీ, త్వరలోనే దీన్ని రైల్వే బోర్డుకు అందించనున్నట్లు సమాచారం. మొత్తం 97 వందే భారత్‌ రైళ్ల తయారీకి ఆర్డర్ ఇచ్చిన రైల్వే బోర్డు ఇప్పటివరకు 86 రైళ్లను అందుకున్నట్లు ఐసీఎఫ్‌ వెల్లడించింది. మిగిలిన 11 ఛెయిర్‌ కార్‌ బోగీలను 2025-26 ఆర్థిక సంవత్సరంలో అందించనున్నట్లు తెలిపారు.