Gujarat: వడోదరలో జైషే మహమ్మద్ అనుమానిత ఉగ్రవాది పట్టివేత.. ఏకే 47, 23 బుల్లెట్లు స్వాధీనం
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన అనుమానాస్పద వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వడోదరలో ఓ వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌తో అతనికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వడోదరలోని ఓ బస్టాండ్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఏకే 47 రైఫిల్‌తో పాటు 23 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఏకే 47 రైఫిల్ ఎలా అందింది? దానిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎవరికి అందించేందుకు తీసుకెళ్తున్నాడు? అనే కోణాల్లో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయుధాల సరఫరా వెనుక ఎవరైనా ఉన్నారా? మరికొందరితో అతనికి సంబంధాలు ఉన్నాయా? అనే వివరాలను సేకరిస్తున్నారు.
వివరాలు
కశ్మీర్‌లో 65 మంది విదేశీ ఉగ్రవాదులు?
దేశంలో విదేశీ ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం జమ్మూకశ్మీర్‌లో కనీసం 65 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు.
వీరిలో 55 మందికి జైషే మహమ్మద్, లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదుల సంఖ్య ప్రస్తుతం సున్నాకు చేరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో విదేశీ ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఇతరత్రా సహకారం అందించడం వంటి చర్యలకు పాల్పడుతున్న స్థానికులపైనా భద్రతా సంస్థలు నిఘా పెట్టాయి.