LOADING...
Air India crash site: అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంపై వివాదం.. హాస్టల్ నిర్మాణానికి కుటుంబాల అభ్యంతరం
అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంపై వివాదం.. హాస్టల్ నిర్మాణానికి కుటుంబాల అభ్యంతరం

Air India crash site: అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంపై వివాదం.. హాస్టల్ నిర్మాణానికి కుటుంబాల అభ్యంతరం

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా AI171 అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తికానున్న వేళ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబాల్లో ఆవేదన రేకెత్తిస్తోంది. జూన్ 12న ఈ విషాద ఘటనకు తొలి వార్షికోత్సవం రానుండగా, ప్రమాదంలో దెబ్బతిన్న మెఘానీనగర్‌లోని హాస్టల్ భవనాలను కూల్చి అక్కడ రూ.105 కోట్ల వ్యయంతో కొత్త రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలన్న ప్రభుత్వ యోచనపై కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ సముదాయంపై విమానం కూలిన ఆ ప్రదేశం తమకు సాధారణ భూమి కాదని, అది తమ కుటుంబ సభ్యుల జ్ఞాపకాలతో ముడిపడి ఉందని బాధితులు చెబుతున్నారు.

వివరాలు

బాధితుల ఆందోళన..

కనీసం కొంత భాగాన్ని అయినా ప్రమాదంలో మృతిచెందిన వారి స్మారక స్థలంగా నిలుపాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు పంపినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన సూరత్‌కు చెందిన 32 ఏళ్ల ముక్తి వన్సాడియా మాట్లాడుతూ.. స్మారక స్థలం ఏర్పాటు చేయాలన్న తమ డిమాండ్ "మరణించిన వారికి గౌరవం, మర్యాద ఇవ్వడానికే" అని చెప్పారు. పరిహారం ఇవ్వడం మాత్రమే గౌరవం కాదని, అవసరమైతే ప్రభుత్వం ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు తగిన గౌరవం కావాలని ఆమె అన్నారు.

వివరాలు

ప్రమాదం తర్వాత మారిన బతుకులు..

విమాన ప్రమాదం తర్వాత ట్రావెల్ ఏజెన్సీ ఉద్యోగాన్ని వదిలేసిన ముక్తి, తర్వాత టాటా గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమంలో ఉద్యోగం స్వీకరించినట్లు తెలిసింది. స్మారక స్థలం కోసం అవసరమైతే ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె చెప్పారు. లండన్‌కు తొలిసారి ప్రయాణిస్తున్న సమయంలోనే తన తల్లిదండ్రులు ఈ ప్రమాదానికి గురయ్యారని, "ఒంటరితనపు చీకటి"లో జీవిస్తున్నానని ఆమె భావోద్వేగంగా వివరించారు. ఇదే సమయంలో మరో బాధితుడి కుటుంబ సభ్యురాలు, లండన్‌లో నివసిస్తున్న మహిళ, గుజరాత్ ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఇతర అధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. ప్రమాద స్థలాన్ని సాధారణ భూమిగా లేదా మౌలిక వసతుల ప్రాజెక్టుగా చూడొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Advertisement

వివరాలు

రూ.53.12 కోట్ల నష్టపరిహారం..

మరోవైపు గుజరాత్ ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పంషేరియా మాట్లాడుతూ.. ప్రమాదంతో దెబ్బతిన్న నాలుగు హాస్టల్ బ్లాక్‌లు, క్యాంటీన్, సబ్‌స్టేషన్ భవనాలకు జరిగిన నష్టపరిహారంగా టాటా ఎయిర్‌లైన్స్ రూ.53.12 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపారు. అసర్వాలోని సివిల్ హాస్పిటల్ సమీపంలోని న్యూ మెంటల్ క్యాంపస్‌లో ఉన్న ఈ భవనాలు నిర్మాణపరంగా ప్రమాదకరంగా మారినట్లు ఆడిట్‌లో తేలడంతో వాటి కూల్చివేత తప్పనిసరి అయిందని చెప్పారు.

Advertisement

వివరాలు

వచ్చే మూడేళ్లలో 144 మంది విద్యార్థులకు వసతి..

ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మార్గదర్శకత్వంలో రూపొందించిన పునర్నిర్మాణ ప్రణాళిక ప్రకారం.. అక్కడ 'అతుల్యం 1 నుంచి 7' పేరుతో జీ+8 సూపర్ స్పెషాలిటీ పీజీ హాస్టల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. ఇందులో వివాహిత పీజీ డాక్టర్ల కోసం 236 అపార్ట్‌మెంట్‌లు, స్టూడియో తరహా గదులు, జిమ్నాసియం, ఆధునిక క్యాంటీన్, వినోద గది, ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు, బేస్‌మెంట్ పార్కింగ్ వంటి సదుపాయాలు ఉండనున్నాయి. ఈ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు 2026-27 బడ్జెట్‌లో ఇప్పటికే రూ.34.65 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. వచ్చే మూడేళ్లలో 144 మంది విద్యార్థులకు కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా వసతి కల్పించనున్నట్లు సమాచారం.

Advertisement